Guppedantha Manasu Weekly Roundup: రిషిధార ప్రేమ దోబుచులాట.. మరోవైపు మూడు రోజుల గడువు

యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

వసుధారతో మహేంద్ర గురు దక్షణ గురించి మాట్లాడిన విషయం రిషికి దేవయాని ద్వారా తెలుస్తుంది. దీంతో మహేంద్రపై రిషి కోపంగా ఉంటాడు. ఈ విషయం దేవయానికి తమ ద్వారానే తెలిసిందని ఒకరినొకరు నిందించికుంటూ బాధపడుతుంటారు మహేంద్రా, జగతి. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది.

అప్పుడు తెలుస్తుంది, రిషి తన తప్పు తానే తెలుసుకునే రోజు కూడా వస్తుంది అని అంటాడు మహీంద్రా. మరోవైపు దేవయాని చాలా సంతోషంగా ఉంటుంది. ఇల్లంతా ఇలా ప్రశాంతంగా ఉంటే ఎంత బావుందో అనుకుంటూ.. వీళ్ల ఏడుపులు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి లేకపోతే ఏంటి నన్ను పట్టించుకోకుండా వీళ్లకు వీళ్లు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చూడు ఏమైందో అని తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది దేవయాని. తర్వాత రిషి దగ్గరికి వెళ్తుంది దేవయాని.

ఆ తర్వాత కారులో బయటకు వెళతారు రిషి, వసుధార. అక్కడ నువ్ నన్ను రిషిగా ప్రేమించావా? లేకపోతే జగతి మేడం కొడుకుగా ప్రేమించావా? అని వసుధారను రిషి ప్రశ్నించగా.. మీరు జగతి మేడం కొడుకే కదా సార్ అని అంటుంది వసుధార. నువ్వు తెలివిగా సమాధానం చెప్పకు వసుధార అని రిషి అంటాడు. సార్ మీరు ఎలా అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను.

మీరే నా ప్రాణం సార్ అని వసుధార అంటుంది. మా డాడ్ కి నీకు మధ్య జరిగిన దానికి మన ప్రేమకు ఎలాంటి సంబంధం లేదు. ఒక మనిషిని ప్రేమించడానికి ఒప్పందాలు, షరతులు పెట్టావనే బాధ తప్ప మరేమి లేదు అని అంటాడు రిషి. ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. నీ మీద నాకు ప్రేమ పోలేదు. కోపం మాత్రమే ఉంది వసుధార అని రిషి తన మనసులో అనుకుంటాడు. తర్వాత వసుధారను ఇంట్లో డ్రాప్ చేస్తాడు రిషి.

నా కోపం పక్కన పెడతాను మన ప్రేమ కోసం ఒక సహాయం చేస్తావా వసుధారా అని అడుగుతాడు రిషి. ఏంటీ సార్ అని అంటుంది వసుధార. ఏం జరిగిన నాకు నీపై ప్రేమ తగ్గదు. కానీ నీ నుంచి నాకు ఒక సమాధానం కావాలి వసుధార. అది కూడా నాకు నచ్చిన సమాధానం కావాలి అని అంటాడు రిషి. దీంతో నచ్చిన సమాధానం అంటే జగతి మేడంను రిషి అమ్మ అని పిలిచే విషయమా అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆ ప్రశ్న ఏంటో.. దానికి సమాధానం ఏంటో నీకు తెలుసు వసుధార అని రిషి అనడంతో షాక్ అవుతుంది వసు. ఆ తర్వాత నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను. నీ దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అని అంటాడు రిషి. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. తన చేతిపై చేయి వేసి కొద్ది సేపు చూసి.. 3 రోజుల గడువు మాత్రం మరిచిపోకు అని చెప్పి వెళ్లిపోతాడు రిషి.

ఎవరికీ తెలియకుండా తీసుకున్న పెన్ డ్రెవ్ లో కాలేజ్ లోని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తాడు రిషి. అందులో వసుధార ముఖానికి కర్చీఫ్ పెట్టి మత్తుమంది పెట్టి ఓ మహిళా కిడ్నాప్ చేయించడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలో సాక్షిని చూసి షాక్ అవుతాడు రిషి. తర్వాత ఇంత పెద్ద విషయాన్ని వసుధార తన దగ్గర దాచిందా అని అనుకుంటాడు రిషి. సాక్షి విషయం వసుధారను అడుగుదామనుకున్న రిషి మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గుతాడు. తర్వాత తన వసుధార తన ఇంట్లోనే ఉందని తెలుసుకున్న రిషి ఇంటికి వెళతాడు. ఆతర్వాత దేవయాని రూమ్ కి వెళ్లి సీసీ ఫుటేజ్ వీడియో గుర్తు చేసుకుని.. సాక్షి గురించి తలుచుకుంటే మండిపోతుందంటాడు రిషి. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు అని అనుకున్న దేవయాని.. సాక్షి మాటెత్తగానే షాక్ అవుతుంది.

వంటగదిలో హడావిడిగా వంట చేస్తుంటుంది వసుధార. తన వెనుకగా వచ్చిన వ్యక్తి జగతి మేడం అనుకుని.. ఏంటీ మేడం.. మీరు కొంచెం కూరలు తరగండి అంటుంది. ఈ మాట విన్న రిషి ఏం మాట్లాడకుండా కూరగాయలు కట్ చేసేందుకు సిద్ధమవుతాడు. వసుధార మాత్రం గలగల మాట్లాడుతూనే ఉంటుంది. రిషి సార్ కూడా మీలాగే మేడం.. ఆల్ రౌండర్. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. నేను రిషి సార్ కు దొరకడం లక్కీ కదా.. అయినా మీరు ఒప్పుకోరు లేండి.. నేనే లక్కీ అంటారు అంతే కదా.. ఏంటీ మేడమ్ ఏం మాట్లాడటం లేదు అని వెనక్కి తిరిగి రిషిని చూసిన వసుధార షాక్ అయి చేతిలో ఉన్న గరిట కింద పడేస్తుంది.

జ్యూస్ పడిన డ్రెస్ ను మార్చుకునేందుకు తన గదిలోకి వెళతాడు రిషి. ఇదంతా తనవల్లే జరిగిందని బాధపడుతూ తెలియకుండానే రిషి రూమ్ లోకి వెళుతుంది వసుధార. డ్రెస్ మార్చుకునేందుకని టవల్ లో ఉంటాడు రిషి. ఇక వసుధార తన గదిలోకి రావడం చూసిన రిషి సిగ్గుతో కప్ బోర్డ్ లోపల దాక్కుంటాడు. దీంతో సారీ సార్ అని వసుధార అంటుంది. వచ్చేముందు చూసుకోవాలిగా అని రిషి అంటాడు. జ్యూస్ మీ మీద పోశాను కదా సార్.. ఆ టెన్షన్ లో మర్చిపోయాను అని వసుధార అనగానే.. ఇప్పుడేంటీ వెళ్లు అంటాడు రిషి. అక్కడి నుంచి వెళుతూ జ్యూస్ పడిన రిషి డ్రెస్ ను తీసుకుంటుంది. అదెందుకు అని రిషి ప్రశ్నించగా.. నేనే క్లీన్ చేసి ఇస్తాను వసుధార సమాధానం చెబుతుంది.