హెచ్‌సీఏ..ఏందిదీ, చివరికీ మ్యాచ్ టైం కూడా తప్పే, దుమారం

ఇప్పుడు అంతా టీ 20 ఫీవర్.. అందరి చూపు ఉప్పల్ స్టేడియం వైపే. ఇప్పటికే టికెట్ల వివాదంలో పీకల్లోతులో కూరుకుపోయిన హెచ్‌సీఏ.. మరో తప్పిదం చేసింది. మ్యాచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో దానిని అంతా లైట్ తీసుకుంటున్నారు. లేదంటే ట్రోల్ చేసేవారు. టికెట్ల కోసం ప్రేక్షకులు యుద్దాలే చేయాల్సి వచ్చింది. అసలు ఇంతకు ఇచ్చినవీ ఎన్నో.. కేటాయించనవి ఎన్నో తెలియడం లేదు.

ఇప్పుడు మ్యాచ్ టైమింగ్‌ను టికెట్లపై తప్పుగా ముద్రించారు. మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవనుంది. టాస్ 6.30లకే వేస్తారు. టికెట్లపై మ్యాచ్ 7.30కు మొదలవుతుందని ముద్రించింది. పది రోజులు ముందు నుంచే టికెట్లు అమ్ముతున్నా దీనిని గుర్తించలేకపోయింది. శనివారం రాత్రి మీడియాకు ఓ ఈమెయిల్ పంపించింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుందని అందులో ఉంది.

టికెట్లపై టైమింగ్ తప్పుగా ముద్రించిన విషయాన్ని మాత్రం హెచ్‌సీఏ అంగీకరించడం లేదు. టికెట్లపై టైమ్ చూసి అభిమానులు 7.30కి వస్తే అరగంట ఆటను కోల్పోయే అవకాశం ఉంది. మ్యాచ్ విషయంలో ముందు నుంచీ హెచ్ సీఏ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. టీ20కి సంబంధించి 39 వేల టికెట్లు ఉంటే.. అందులో సగం కూడా అందుబాటులో ఉంచలేదు. పేటీఎంలో దొరక్క కౌంటర్లలో కొనేందుకు అభిమానులు జింఖానా మైదానానికి పోటెత్తితే అక్కడ కేవలం మూడు వేల టికెట్లను మాత్రమే అమ్మింది.

వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరగ్గా పలువురికి గాయాలయ్యాయి. ఘటనతో తమకేం సంబంధం లేదని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చేతులు దులుపుకున్నారు. 12,500 టికెట్లు ఏం చేశారో, ఎవరికి అమ్మారో అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.