సీఎం పదవి నుంచి గెహ్లాట్ అవుట్..! నేడు సీఎల్పీ సమావేశం – కీలక నిర్ణయం..!!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రాజస్థానం సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటుగా మాజీ కేంద్ర మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శశి థరూర్ తన నామినేషన పత్రాలను తీసుకోవటంతో ఆయన పోటీ చేయటం ఖాయమని తెలుస్తోంది. ఇక, గాంధీయేతర వ్యక్తి ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తొలి వరుసలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి తొలి నుంచి విధేయుడిగా ఉండటంతో పాటుగా, సోనియా – రాహుల్ మద్దతు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది.

అయితే, తాజాగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలని పరోక్షంగా గెహ్లాట్ ను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లో సీఎం సీటు ఆశిస్తున్న సచిన్ పైలైట్ కలిసిన తరువాత రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసారు.

ఇక, గెహ్లాట్ ఇప్పటికే సోనియాను కలిసి పోటీ చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఈ నెల 28న గెహ్లాట్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే నేటి సాయంత్రం రాజస్థాన్ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. జైపూర్ లోని రాజస్థాన్ సీఎం గోహ్లాట్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి కాంగ్రెస్ పరిశీలకులుగా సీనియర్ నేత మల్లి ఖార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అజయ్ మాకెన్ హాజరు కానున్నారు.

రాష్ట్రంలో వారం రోజుల్లో జరుగుతున్న రెండో సమావేశం ఇది. అధ్యక్ష బరిలో తాను నిలబడతానని చెప్పిన సమయంలోనే గెహ్లాట్ తాను రాజస్థాన్ సీఎంగానూ కొనసాగుతానని కోరారు. కానీ, అది సాధ్యం కాదని తాజాగా రాహుల్ వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. దీంతో, ప్రస్తుత రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ ను సీఎం చేయాలని గెహ్లాట్ కోరుతున్నారు. ఇదే సమయంలో కొంత కాలం గా సీఎం పదవి కోసం నిరీక్షిస్తున్న సచిన్ పైలట్ ఇప్పుుడు పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు రాహుల్ మద్దతు ఉందని చెబుతున్నారు.

దీంతో.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్ విజయం సాధిస్తే..పైలెట్ కు పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అయితే, బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పైన కన్నేసి ఉండటంతో, ఆ పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా .. పార్టీ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలకు ఛాన్స్ లేకుండా ఈ వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్ గెలిస్తే..పైలెట్ కు లైన్ క్లియర్ అయినట్లే. దీంతో, ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.