వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చే నేత ఎవ‌రు?

రానున్న ఎన్నిక‌లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, తెలుగుదేశంకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లాంటివి. ఎవ‌రు గెలిచినా రేసులో నిలుస్తారు. లేదంటే అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విష‌యం రెండు పార్టీల అధినేత‌లైన వైఎస్ జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు తెలుసు. అందుకే రాబోయే ఎన్నిక‌ల్లో వారికి రెండో ఆప్ష‌న్ లేదు. విజ‌యం మాత్ర‌మే సాధించాలి. అందుక‌నుగుణంగా ఇప్ప‌టినుంచే ఇద్ద‌రు నేత‌లు వ్యూహాలు అమ‌లుప‌రుస్తున్నారు.

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు 2014లో ప్రాతినిధ్యం వ‌హించారు. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా పోటీచేసి మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల్లో శిద్ధా త‌న కుమారుడు సుధీర్‌తో క‌లిసి వైసీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున దర్శి నుంచి పోటీచేసిన క‌దిరి బాబూరావు కూడా ఓట‌మిపాలై వైసీపీలో చేరారు.

శిద్ధా రాఘ‌వ‌రావు వైసీపీలో చేర‌డంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప‌మిడి ర‌మేష్‌ను ఇన్‌ఛార్జిగా చేసింది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేశారు. జిల్లా స్థాయి నేత‌ల అండ‌తోపాటు వైసీపీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాల‌ను ఉప‌యోగించుకొని ద‌ర్శి మున్సిపాలిటీని తెలుగుదేశం కైవ‌సం చేసుకోగ‌లిగింది. ఇందులో రమేష్ కృషి ఉంది. ఈ విషయం టీడీపీ శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. అయితే అక‌స్మాత్తుగా త‌న‌కు అధిష్టానం నుంచి స‌హ‌కారం అంద‌డంలేదంటూ పమిడి ర‌మేష్ ఇన్‌ఛార్జి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

రానున్న ఎన్నిక‌ల్లో పోటీనుంచి ఒక‌ర‌కంగా ఆయ‌న త‌ప్పుకున్నారు. ఎన్నారై సుబ్బారావు ఈ సీటుకోసం ప్ర‌య‌త్నించారుకానీ స‌రైన హామీ ల‌భించ‌లేద‌ని తెలిసింది. తాజాగా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం త‌ర‌ఫున వైసీపీ నుంచి వ‌చ్చే నేత‌కు సీటు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం న‌డుస్తోంది. టీడీపీ నుంచి శిద్ధా రాఘ‌వ‌రావు, క‌దిరి బాబూరావు వెళ్లారు. వీరికి అక్క‌డ స‌రైన ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. దీంతో ఈ ఇద్ద‌రిలో ఒక‌రు అక్క‌డి నుంచి పోటీచేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు కార్య‌రూపం దాలుస్తుందో స్ప‌ష్ట‌త‌ రావాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్పని పరిస్థితి.!!