విజయనగర సామ్రాజ్య క్షత్రియ వీరుడు.. నరసాపురం యోధుడిగా ప్రబోధ్??

కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఇటీవలే కొవిడ్ అనంతర వ్యాధులతో ఇబ్బంది పడుతూ మృతిచెందారు. సినీ పరిశ్రమ మూలస్తంభాల్లో ఒకరిగా ఉన్న కృష్ణంరాజు తన రాజకీయ జీవితంలో కూడా మంచిపేరును సంపాదించారు. బయట వ్యక్తులు, తనకు సంబంధంలేనివారు చేసే వ్యాఖ్యలను కూడా సీరియస్ గా తీసుకొని పార్టీ మారి నిజాయితీగా పనిచేసి చూపించారు. ఆయన మరణించినప్పుడు శరీరంపై బీజేపీ పతాకాన్ని ఉంచి గౌరవించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో కృష్ణంరాజును సాగనంపింది.

కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోను, తర్వాత ఆయనకు రాజ్ నాథ్ సింగ్ అత్యంత సన్నిహితులు. అందుకే రాజ్ నాథ్ ప్రత్యేకంగా వచ్చి కుటుంబ సభ్యులను కలవడమే కాకుండా తానున్నానంటూ ధైర్యం చెప్పారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని పోకుండా ఒక అడుగు కుటుంబ సభ్యులచేత వేయించారు. కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం భారీబడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా ఎవరికీ అందనంత రేంజ్ లో నిలబడ్డారు. ఒకరకంగా బీజేపీ ఆయన్ని తమ సొంతవాడిగా భావిస్తోంది. తరుచుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు కూడా ప్రభాస్ సినిమాల ప్రస్తావవను సమావేశాల్లో తెస్తుంటారు.

నరసాపురం లోక్ సభ నుంచి విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగించాలని కుటుంబ సభ్యులు కూడా నిర్ణయించారు. కృష్ణంరాజుకు కొడుకులు లేకపోవడంతో ఆ లోటును ఆయన సోదరుడి పిల్లలైన ప్రభాస్, ప్రబోధ్ నెరవేరుస్తున్నారు. రాజ్ నాథ్ కోరిక మేరకు పెదనాన్న రాజకీయ వారసత్వాన్ని కూడా వీరు కొనసాగించబోతున్నారు. ఈమేరకు వారు రాజ్ నాథ్ కు హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

విజయనగర సామ్రాజ్య క్షత్రియ వంశానికి చెందిన కృష్ణంరాజు కుటుంబానికి ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తోపాటు పరపతిని కూడా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించారంటున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ప్రబోధ్ ను ఎంపీగా బరిలో దింపాలని భావిస్తోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు లోబడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఎగ్జిబిటర్ గా కూడా కొనసాగుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద సోదరులిద్దరూ దేశంలోనే అత్యంత పెద్ద స్క్రీన్ తో థియేటర్ ను నిర్మించారు. నరసాపురం ఎంపీగా ప్రబోధ్ అని అనుకుంటున్న బీజేపీ ప్రణాళిక ఎంతవరకు విజయవంతమవుతుందనేది తెలియాలంటే ఎన్నికలు జరిగే వరకు వేచిచూడక తప్పేలా లేదు.