రూ.400కే కిలో మటన్, ఎగబడ్డ జనం, కంట్రోల్ చేయలేక పోలీసుల ఇబ్బందులు

అసలే ఆదివారం.. ఇక రేపటి నుంచి శరన్నవరాత్రులు, చాలా మంది ఇవాళ్టికే లాస్ట్.. కొందరు నాన్ వెజ్ తినరు. అలాంటి సమయంలో తక్కువ ధరకు నాన్ వెజ్ దొరికితే ఎలా ఉంటుంది. ఇలానే ఉంటుంది. జనం ఎగబడుతారు. అలాంటి ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ప్రాంతాన్ని బట్టి కిలో మటన్ రూ.600 నుంచి రూ.800 వరకు పలుకుతుంది. కానీ అక్కడ రూ.400కే ఇచ్చారు.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో తక్కువ ధరకే మటన్ లభించింది. ఇంకేముంది జనం ఎగబడ్డారు. మటన్ కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. కిలో మాంసం రూ. 400కే దొరుకుతుండటంతో ప్రజలు భారీగా కొనుగోలు చేశారు. ఇవాళ పెద్దల అమావాస్య కావడంతో మటన్ సెంటర్ దగ్గర భారీగా జనం గుమిగూడారు. మూడు గంటల పాటు జనాలు క్యూలైన్లలో నిలబడి మాంసాన్ని తీసుకెళ్లారు.

మాంసం ప్రియులను కట్టడి చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేసే పరిస్థితి వచ్చింది.తక్కువ ధరకే వస్తుందని మాంసం తినకూడదని.. అది నాణ్యమైనదేనా..? కాదా అనేది తెలుసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులు సూచించారు. వద్దు అని మొత్తుకున్నారు. నాణ్యత లేని మాంసం తిని అనారోగ్యం పాలుకావొద్దని సూచిస్తున్నారు.

వారు చెప్పేది కూడా నిజమే.. ఎందుకంటే తక్కువ ధరకు వస్తోంది కదా అని తిని.. రోగం తెచ్చుకోవడం ఎందుకు అని మరికొందరు అంటున్నారు. కానీ నాన్ వెజ్ ప్రియులు మాత్రం ఊరుకుంటారా.. ఎగబడి మరీ కొనుగోలు చేశారు.