బెట్టింగ్: బాల్, రన్, వికెట్, టాస్, సిరీస్.. వేల నుంచి లక్షల వరకు

కాసేపట్లో టీమిండియా ఆసీస్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం హెచ్‌సీఏ ఏర్పాట్లు చేయగా.. క్రికెట్ లవర్స్ పరుగు తీశారు. స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేవారి సంగతి అలా ఉంటే.. ఇక బయట ఉండే వారు టీవీలకు అతుక్కుపోతారు. ఇక కొందరి పరిస్థితి చెప్పక్కర్లేదు. అంటే బెట్టింగ్ కాస్తారు.

ఒకప్పుడు బెట్టింగ్ అంటే మ్యాచ్‌కు ఉండేది. ఇప్పుడు బాల్, రన్, వికెట్.. అంతేందుకు టాస్ కూడా వేస్తున్నారు. టాస్ గెలవడం నుంచి ప్రతి బంతి, ప్రతి ఓవర్‌కు బెట్టింగ్ పెడుతున్నారు. బుకీలు, మినీ బుకీలుగా రెండు రకాల బెట్టింగ్‌కు దిగుతున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.లక్షల వరకు బెట్టింగ్ పెడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సిరీస్‌ ఎవరు గెలుస్తారనే అంశంపై కూడా భారీ బెట్టింగ్‌కు దిగుతున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌లో లక్షల మంది బెట్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక్క ఓవర్‌లో ఎన్ని ఫోర్లు, సిక్స్ కొడతారని బెట్టింగ్‌ కాస్తున్నారు. ఇండియా గెలుస్తుందని భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఆస్ట్రేలియాపై బెట్టింగ్ చేస్తే రూ.వెయ్యికి రూ.4 వేలు బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై ఎస్‌టీవో, టాస్క్‌ఫోర్స్ పోలీసుల నిఘా పెడుతున్నారు.

ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో ఉప్పల్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్‌ దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌.. నాగ్‌పూర్‌లో అదరగొట్టింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో 91 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు ఉండగానే ముగించింది. నిర్ణాయక మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి హోరాహోరీ ప్రదర్శన కనిపించే అవకాశం ఉంది.