బాలయ్యా..చంద్రబాబుపై పగ తీర్చుకో – మంత్రి రోజా : టీడీపీలో జూ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారు..!!

నందమూరి బాలకృష్ణ లక్ష్యంగా ఏపీ మంత్రులు – వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బాలకృష్ణ తప్పు బట్టారు. సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ ఒక పేరు కాదని, తెలుగు జాతికి వెన్నుముకగా పేర్కొన్నారు. ఆయన వేసిన బిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు అక్కడ ఉన్నారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన ఏపీ మంత్రులు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి రోజా ఇప్పటికే ఒక ట్వీట్ ద్వారా బాలకృష్ణ కు వార్నింగ్ ఇచ్చారు.

ఆ వైరల్ అవుతున్న సమయంలోనే..మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగతీర్చుకో అంటూ మంత్రి రోజా బాలకృష్ణ కు సూచించారు. రైతుల పేరుతో చంద్రబాబు దొంగ పాదయాత్రలు చేయిస్తున్నారని రోజా ఆరోపంచారు. తన సామాజిక వర్గానికి,తన రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడాలనే..ఆనాడు తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో భూములు కొని వ్యాపారం చేశారని విమర్శించారు. ఇప్పటికి కొంతమంది రైతులను మోసం చేస్తూ..వారిని ఉసిగొల్పుతూ..మూడు రాజధానులును అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు నూరాయిన విశాఖ ను పరిపాలన రాజధానిని చేసి తీరుతామని స్పష్టం చేసారు. అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా..రాయలసీమ,ఉత్తరాంధ్రలో రైతులు లేరా అంటూ నిలదీసారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం పైన చంద్రబాబు కుటుంబం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు మాట్లాడారు. టీడీపీలో కొందరు నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టీలో ఎవరూ జూనియర్ ను కలవద్దని చెబుతున్నారంటూ మంత్రులు కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సమయంలో బాలకృష్ణ ఎందుకు అభినందించలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి శంకర నారాయణ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన చంద్రబాబుకే బాలకృష్ణ మద్దతుగా నిలిచారని ఆరోపించారు.