ప్రజలకు అరచేతిలో వైకుంఠం; ఎనిమిదేళ్లుగా ఆడిందే ఆట; మోసగాడు కేసీఆర్: వైఎస్ షర్మిల ధ్వజం

ప్రజా ప్రస్థానం పాదయాత్రను నూట అరవై ఒక్క రోజులుగా కొనసాగిస్తున్న వైయస్ షర్మిల తనదైన శైలిలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా మోమిన్ పేట మండల కేంద్రంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కెసిఆర్ వల్ల ఒక్కరైనా లబ్ధి పొందారా? ఒక్క వర్గానికి అయినా లాభం జరిగిందా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఇచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న హామీని తుంగలో తొక్కారని, ఒక్క మాట కూడా నిలబెట్టుకొని మోసగాడు కేసీఆర్ అంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు.

కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నా ఇప్పటివరకు 17 వేలు మాత్రమే ఇచ్చారంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు కావాలని యువత అడుగుతుంటే కెసిఆర్ మద్యం షాపులను ఎక్కువగా పెంచి, యువతను తాగుబోతులను చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీర్ల తెలంగాణ బార్ల తెలంగాణగా మార్చారని నిప్పులు చెరిగారు వైయస్ షర్మిల.

వ్యవసాయాన్ని కెసిఆర్ బ్రష్టు పట్టించారని, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా ఇచ్చే దిక్కులేదని షర్మిల విమర్శించారు. ముష్టి ఐదు వేల రూపాయలు రైతుబంధు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ వైయస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ దరిద్రం ఇక్కడితో చాలదని దొర కేసీఆర్ దేశాన్ని ఏలతారట అంటూ వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టు కెసిఆర్ వ్యవహారం ఉందని షర్మిల సెటైర్లు వేశారు.

ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. ప్రజలు కష్టాల్లో ఉన్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ ప్రశ్నించలేదు. అందుకే YSR తెలంగాణ పార్టీ పుట్టింది. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, YSR సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం.#MataMuchata #Vikarabad pic.twitter.com/d8xL1EPuzK

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు ఓటు వేసినట్టే అని పేర్కొన్న వైయస్ షర్మిల కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళంతా టిఆర్ఎస్ లో చేరి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని నాలుగు లక్షల కోట్ల అప్పు ప్రస్తుతం మొత్తం మన నెత్తి మీద ఉందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగిందని మండిపడిన షర్మిల ప్రజలు కష్టాల్లో ఉన్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. అందుకే వైయస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేయడం, వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వైయస్ షర్మిల పేర్కొన్నారు.