న‌న్ను, నా కుటుంబాన్ని చంపేస్తామ‌నేవారు: జేడీ(వీవీ) ల‌క్ష్మీనారాయ‌ణ‌

మూలాల‌కు వెళ్లి చికిత్స చేస్తేనే అవినీతిని నిర్మూలించ‌గ‌ల‌మ‌ని సీబీఐ రిటైర్డ్ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. డ‌బ్బులే లేని ఎన్నిక‌ల విధానం రావాల‌ని ఆకాంక్షించారు. స‌మాజంలో సామాన్యుల కంటే అవినీతిప‌రులే నిర్భ‌యంగా తిరుగుతున్నార‌ని జేడీ వ్యాఖ్యానించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో నిర్వహించిన ‘యూత్‌ ఫర్‌ యాంటీకరప్షన్‌’ కార్యక్రమానికి ల‌క్ష్మీనారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గత సంఘటనలను కొన్ని ఆయ‌న విద్యార్థుల‌తో గుర్తు చేసుకున్నారు. ”సీబీఐలో పనిచేసేటప్పుడు ఎర్ర సిరాతో రాసిన లేఖలు వచ్చేవ‌ని, నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని లేఖల్లో రాసేవార‌ని తెలిపారు. రాజ్యాంగం మ‌న‌కు ఎన్నో ఉన్న‌త‌మైన ఆశ‌యాల‌ను, ల‌క్ష్యాల‌ను చేరుకునే విధంగా అవ‌కాశం క‌ల్పించింద‌ని, యువ‌త స‌ద్వినియోగం చేసుకుంటే ఆకాశ‌మే హ‌ద్దుగా ఎద‌గొచ్చ‌న్నారు. తాను జేడీగా ప‌నిచేసిన స‌మ‌యంలో ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను ద‌ర్యాప్తు చేయాల్సి వ‌చ్చింద‌ని, నిరాశ ప‌డ‌కుండా ప‌నిమీద మ‌నం ప్రేమ పెంచుకుంటే ఏదైనా సాధించ‌గ‌ల‌మ‌న్నారు.

ల‌క్ష్మీనారాయ‌ణ సీబీఐ నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా పోటీచేసి ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌కు కూడా దూర‌మ‌య్యారు. కాకినాడ ద‌గ్గ‌ర పొలం కౌలుకు తీసుకొని సేంద్రీయ వ్య‌వ‌సాయం చేస్తున్నారు. అంద‌లో మెళ‌కువ‌ల‌ను కూడా స్థానిక రైతుల‌కు నేర్పిస్తున్నారు. సీబీఐ జేడీగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తోపాటు ప‌లు కీల‌క‌మైన కేసుల‌ను ద‌ర్యాప్తు చేశారు.