దారుణం: ఆటోలో తీసుకెళ్లి వివాహితపై సామూహిక అత్యాచారం

మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దారుణ ఘటన చోటు చేసుకుంది. డిడిగి గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివాహితను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. ఆటోలో తీసుకొచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వివాహితను తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. శనివారం ఉదయం అచేతన స్థితిలో పడివున్న ఆమెను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు.

కాగా, ఈ అత్యాచార ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు జరుపుతున్నారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తు మందు ఇచ్చారా? జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

యువతిపై ప్రేమోన్మాది దాడి

ఓ యువతిపై ప్రేమోన్మాది పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్​ బోల‌క్‌పూర్‌​కు చెందిన రంజిత్​, అదే ప్రాంతానికి చెందిన మరో యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో వారు శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్​ సమీపంలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరగడంతో రంజిత్ పదునైన ఆయుధంతో యువతిపై దాడి చేశాడు.

ఈ ఘటనలో యువతి చేతికి బలమైన గాయమైంది. దాడి చేసిన అనంతరం రంజిత్​ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. తప్పించుకున్న రంజిత్‌​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ పోలీసులు తెలిపారు.