జూ.ఎన్టీఆర్ పై ఉసిగొల్పుతారా- రాజకీయ దగా: బీజేపీ నేత సంచలనం..!!

ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం ఏపీలో కొత్త రాజకీయ టర్న్ తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వివాదం టీడీపీ వర్సస్ వైసీపీగా మారింది. ఈ వివాదం పైన నందమూరి కుటుంబంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్.. షర్మిల స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఎన్టీఆర్ – వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ ఉన్న నేతలని పేర్కొన్నారు. ఈ పోలిక టీడీపీ నేతలకు రుచించలేదు. ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎన్టీఆర్ పేరు తొలిగిస్తే ఇలా స్పందిస్తారా అంటూ నిలదీస్తున్నారు.

మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ సమావేశం కేవలం సినిమా పరంగా జరిగిన సమావేశంగానే తొలుత ప్రచారం సాగింది. కానీ, ఆ తరువాత దీని వెనుక రాజకీయం లేకుండా ఎలా ఉంటుందని బీజేపీ నేతలే వ్యాఖ్యానించారు. తన భేటీ గురించి అమిత్ షా కు ధన్యవాదాలు చెబుతూ మాత్రమే జూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

అంతకు మించి తమ భేటీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం పైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. వరుస ట్వీట్లు చేసారు.

అందులో భాగంగా… సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ లో.. భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్ గారిని వివాదంలో లాగిన వైసీపీ చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే. ప్రభుత్వ వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మరల్చటం కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారు. సీ.ఎన్టీఆర్ గారి మనసును మీ వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టొద్దు సిఎం..అంటూ సూచించారు.

దీనికి కొనసాగింపుగా చేసిన మరో ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో.. యుగ పురుషుడు ఎన్టీఆర్ గారినుంచి టీడీపీని దక్కించుకోవటం కోసం ఒకప్పుడు ఒక పోటు పొడిచి ఆయన మరణానికి కారకులైనవారు, ఈరోజున ఆయనపై ‘అతిప్రేమ’ను ఒలకబోస్తూ జూ.ఎన్టీఆర్ ను “నువ్వు వారసుడివా” అని వెక్కిరించటం, అవమానించటం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి,’దగా’ రాజకీయాలకు పరాకాష్ట…అంటూ పేర్కొన్నారు.

దీని ద్వారా జూనియర్ ను ఓన్ చేసుకొనేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందనే చర్చ రాజకీయంగా మొదలైంది. అటు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పేరు మార్పు వ్యవహారం పైన చేసిన సోషల్ మీడియా పోస్టు కు కౌంటర్ గా ఏపీ మంత్రులు వరుసగా సోషల్ మీడియా ద్వారా కౌంటర్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఇప్పటికే పేరు మార్పు బిల్లు ఆమోదం పొందింది. ఇక, ఇప్పుడు బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా నిలుస్తున్న వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది.