జార్జియా మెలోని: ఇటలీలో ముస్సోలిని తర్వాత ఈమె పేరే వినిపిస్తోంది ఎందుకు

అన్నా మరియా టోర్టోరా 40 ఏళ్లుగా రోమ్ మార్కెట్‌లోని తన స్టాల్‌లో టమోటాలు, తాజా దోసకాయలను విక్రయిస్తున్నారు.

చాలాకాలం కిందట కూరగాయలు కొనడానికి వచ్చే తన తాతయ్య చేయి పట్టుకుని లైన్లో నిల్చునే ఓ చిన్న అమ్మాయి ఇప్పుడు ఇటలీ ప్రధాని రేసులో ఉంటుందని ఆమె ఊహించలేకపోయారు.

ఆ చిన్నారి ఎవరో కాదు.. ఇటలీకి నాయకత్వం వహించే వారిలో ఇప్పుడు ముందు వరుసలో నిలిచిన జార్జియా మెలోని.

”నా దగ్గర బీన్స్‌ తింటూ ఆమె పెరిగారు. నేనే ఆమెను పెంచాను” అంటూ ఇప్పుడు అన్నా మరియా గర్వంగా చెబుతున్నారు.

రోమ్‌లోని గార్బటెలా జిల్లాలో ఈ మార్కెట్ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని వామపక్షాల కోటగా భావిస్తారు. అయితే, ఇక్కడి నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకురాలు, బెనిటో ముస్సోలినీ తర్వాత ఇటలీకి ప్రధాని కానున్న తొలి రైట్ వింగ్ లీడర్‌గా నిలవనున్నారు. ఆదివారం ఇటలీలో ఎన్నికలు జరుగుతున్నాయి.

”ఆమె, ఈ ప్రాంత ప్రతినిధి కాదు. ఇది ఏళ్లుగా వామపక్షాల అడ్డా” అని మరో కూరగాయల దుకాణాదారు మార్టా అన్నారు.

భవిష్యత్ గురించి తనకు భయంగా ఉందని మార్టా తల్లి లూసియానా మాతో అన్నారు. ”నేను ఫాసిస్ట్‌కు తీవ్ర వ్యతిరేకిని. ఒకవేళ ఆమె ఎన్నికైతే, అది చాలా దారుణంగా ఉంటుంది” అని ఆమె అన్నారు.

ఫాసిస్ట్ అనే గుర్తింపును జార్జియా మెలోని తిరస్కరిస్తారు.

జార్జియా మెలోని పార్టీ ‘ఫ్రాటెల్లీ డి ఇటాలియా (బ్రదర్స్ ఆఫ్ ఇటలీ)’, ఒపీనియన్ పోల్స్‌లో ముందంజలో ఉంది.

ఫ్రాటెల్లీ డి ఇటాలియా పార్టీని 2012లో స్థాపించారు. ఈ పార్టీ రాజకీయ మూలాలు, ఇటలీ సామాజిక ఉద్యమం (ఎంఎస్‌ఐ)తో ముడిపడి ఉన్నాయి. ఈ ఉద్యమం ముస్సోలిని ఫాసిజం నుంచి పెరిగి పెద్దయింది.

ఈ పార్టీ లోగో ‘మూడు రంగుల జ్వాల’. దీన్ని ముస్సోలిని సమాధిపై మండుతున్న మంటగా భావిస్తారు.

”జార్జియా మెలోని ఈ లోగోను వదిలేయాలని అనుకోరు. ఎందుకంటే ఇదే ఆమె గుర్తింపు. దాన్నుంచి ఆమె తప్పించుకోలేరు” అని రోమ్‌లోని సఫీంజా యూనివర్సిటీకి చెందిన రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ జియాన్లుకా అన్నారు.

”ఆమెది ఫాసిస్ట్ పార్టీ కాదు. ఫాసిజం అంటే అధికారాన్ని పొంది వ్యవస్థను ధ్వంసం చేయడం. ఆమె అలా చేయరు. చేయలేరు కూడా. కానీ ఆ పార్టీలో నియో ఫాసిస్ట్ ఉద్యమానికి చెందిన వారున్నారు” అని ఆయన వివరించారు.

జార్జియా మెలోని, రోమ్‌లో జన్మించారు. ఆమెకు ఏడాది వయస్సున్నప్పుడు ఆమె తండ్రి ఫ్రాన్సెస్కో, కుటుంబాన్ని వదిలిపెట్టి కానరీ ఐలాండ్స్‌కు వెళ్లిపోయారు. ఫ్రాన్సెస్కోది వామపక్ష భావజాలం. జార్జియా తల్లి అనా, రైట్ వింగ్ భావజాలానికి చెందినవారు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతోనే ఆమె రాజకీయ ప్రయాణం రైట్ వైపు సాగిందనే ఊహాగానాలు ఉన్నాయి.

తండ్రి వెళ్లిపోయాక జార్జియా కుటుంబం, గార్బటెలాకు మారింది. అక్కడే ఆమె తాతయ్య కుటుంబం ఉంటుంది. అక్కడ 15 ఏళ్ల వయస్సులో ఉండగా జార్జియా, యూత్ ఫ్రంట్‌లో చేరారు. ఇది నియో ఫాసిస్ట్ ఎంఎస్ఐకి చెందిన యువ జన విభాగం. తర్వాత ఆమె ‘నేషనల్ అలియెన్స్’ విద్యార్థి శాఖకు అధ్యక్షురాలు అయ్యారు.

1992లో మార్కో మర్సిలియోను జార్జియా కలిశారు. ఆ సమయంలో గార్బటెలాలోని ఎంఎస్ఐ కార్యాలయంలో మార్కో ఒక సమావేశాన్ని నిర్వహించారు. మార్కో, ఆమె కంటే పదేళ్లు సీనియర్. తర్వాత ఆమెకు సన్నిహిత మిత్రుడిగా, రాజకీయ స్నేహితుడిగా మారారు. ఇప్పుడు అబ్రుజో రీజియన్‌కు ఆయన అధ్యక్షునిగా ఉన్నారు.

”ఈ బక్కపల్చని అమ్మాయి ఎప్పుడూ చాలా గంభీరంగా, పట్టుదలతో ఉంటారు. మీరు ఆమెను గమనించే ఉంటారు. విద్యార్థి సమావేశాల్లో ఆమెనుంచి మైక్రోఫోన్ తీసుకోవడం ఎవరి వల్ల కాదు” అని అన్నారు.

చాలా ఏళ్లుగా మార్కో ఆమెను చూస్తున్నారు. కుటుంబ సెలవులు, చర్చలు, సామాజిక చర్చల్లో వారు కలిసి పాల్గొన్నారు. ఆమె ఆత్మవిశ్వాసంగా ఈ స్థాయికి ఎదగడాన్ని ఆయన చూశారు.

”ఆమెకు అప్పట్లో అభద్రతాభావం ఉండేది. అదే ఆమెకు బలంగా మారి ఉండొచ్చు. దానికారణంగానే ఆమె ఒక సమస్యను పరిష్కరించడానికి ముందు చాలా ఎక్కువగా సంసిద్ధమై వచ్చేవారు” అని మార్కో అన్నారు.

జార్జియా మెలోని 2008లో ఇటలీకి యువజన క్రీడాశాఖ మంత్రి అయ్యారు. 31 ఏళ్ల వయస్సులోనే మంత్రి పదవిని అధిష్టించిన ఆమె ఇటలీకి చెందిన అతిపిన్న మంత్రిగా రికార్డులకు ఎక్కారు.

2012లో ఆమె సొంతంగా పార్టీని స్థాపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ కేవలం 4 శాతం ఓట్లను సాధించింది.

ప్రస్తుతం, మరియో డ్రాగికి చెందిన జాతీయ ఐక్యతా సంకీర్ణ ప్రభుత్వం నుంచి దూరంగా ఉన్న ఏకైక ప్రధాన పార్టీ నాయకురాలిగా ఆమె ఒపీనియల్ పోల్స్‌లో ఆమె ముందున్నారు.

ఇటలీలో జరుగనున్న ఎన్నికల్లో ఆమె మెజారిటీ సాధించే అవకాశం ఉంది. సిల్వియో బెర్లూస్కోనీతో పాటు మాజీ హోం మంత్రి మటియో సాల్వినీకి చెందిన ఫార్-రైట్ లీగ్ పార్టీతో ఆమె కలిసి పనిచేస్తున్నారు.

కానీ, ఆమె పాటించే కఠిన సంప్రదాయక సామాజిక విధానాలు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

”సహజ కుటుంబాలకు ‘యస్’… ఎల్‌జీబీటీ లాబీలకు ‘నో’ ” అంటూ ఇటీవల స్పెయిన్ ఫార్-రైట్ వోక్స్ పార్టీ ర్యాలీలో ఆమె పిడుగు వేశారు. వలస పడవలను ఆపేందుకు లిబియాపై నావికదళా ముట్టడికి ఆమె పిలుపునిచ్చారు.

”మెలోనీ, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదు. కానీ, యూరోపియన్ యూనియన్‌కు ఆమె ప్రమాదకరం” అని ప్రొఫెసర్ పసరెలీ అన్నారు.

హంగరీ, ఫ్రాన్స్‌లోని జాతీయవాద నాయకులు, మెలోనీ ఒకేరకమైన వారని వర్ణించారు.

ఇటలీకి తొలి మహిళా ప్రధాని కావాలనే ఆశతో ఆమె ‘మహిళా గుర్తింపు’ను నొక్కి చెప్పారు.

”ఇటాలియన్ కుటుంబాల్లో ఆధిపత్యం అమ్మలదే. వంటగదిని పాలించే ఆమెకు ఒక ప్రత్యేకమైన ‘మాచో’ గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపును మెలోని తెలివిగా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఇది వ్యవస్థలో ప్రధాన భాగానికి కనెక్ట్ అవుతుంది” అని ప్రొఫెసర్ పసరెలీ అన్నారు.

”ఒక తండ్రి తన కూతుర్ని దైవ పీఠం వద్దకు నడిపించినట్లుగా నేను గొప్పగా భావిస్తున్నా. ఆమె ఇంత సమర్థురాలు అనుకోకపోతే, మేం అసలు పార్టీనే స్థాపించి ఉండకపోయేవాళ్లం” అని మార్కో వ్యాఖ్యానించారు.

వచ్చే నెలలో ఒకవేళ ఆమె గెలిస్తే, మొదటి మాటగా మీరు ఏం చెబుతారు అని ప్రశ్నించగా… ‘గో ఫర్ ఇట్. ఇది సాధించాలని మనందరం కోరుకున్నాం. ఇప్పుడిక దాన్ని సమర్థంగా ఎదుర్కో’ అని చెబుతాను అని ఆయన సమాధానం ఇచ్చారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)