గుడివాడ వచ్చాం: తొడగొట్టిన మహిళ – నానికి సవాల్ : చెప్పు చూపించిన మాగంటి..!!

గుడివాడలో కొడాలి నాని లక్ష్యం అమరావతి రైతుల యాత్ర వేళ సవాళ్లు మొదలయ్యాయి. తొడ గొడుతూ..చెప్పులు చూపిస్తూ యాత్ర వేళ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి కొడాలి నాని అడ్డా గుడివాడలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడలోకి ప్రవేశిస్తూనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమరావతి రైతుల అనుకూల – మూడు రాజధానుల మద్దతు దారుల నినాదాలతో హోరెత్తాయి. అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడకు చేరుకొనే సమయానికి వారికి మద్దతుగా భారీగా టీడీపీ నేతలు చేరుకొనే ప్రయత్నం చేసారు.

మీ స్కెచ్ లు మీకుంటే,మా స్కెచ్ లు మాకుంటాయి.ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు,నాయకులు ఎవ్వరూ మద్దతు ఇవ్వకుండా అతి చేస్తున్న పోలీసులకు టీడీపీ నాయకులు సరైన సమాధానం ఇచ్చారు.గుడివాడ సెంటర్లో పోలీసుల వలయాన్ని చేధించుకొని వెళ్ళి రైతులకు మద్దతు తెలిపిన చింతమనేని pic.twitter.com/zBn9IKKl6z

పశ్చిమ గోదావరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీ..ఎమ్మెల్యేలు వారితో కలిసారు. ఈ సమయంలో అమరావతి రైతులు మాజీ మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు. దమ్ముంటే బయటకు రావాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు. మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న కొడాలి నానిని చెప్పు దెబ్బలతో సత్కరించాంటూ టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు చెప్పు చూపిస్తూ గట్టిగా నినాదాలు చేసారు. నెహ్రూ చౌక్‌ సెంటర్‌ వద్దకు యాత్ర రాగానే.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరుకు చెందిన న్యాయవాది, .రైతు అభినయశ్రీ సింధూర అన్నా తొడగొట్టన్నా అని కోరారు.

నేనెందుకమ్మా నువ్వే పైకివచ్చి తొడగొట్టంటూ ఆమెను ప్రభాకర్‌ ప్రోత్సహించారు. వ్యాన్‌పైకి వచ్చిన సింధూర తొడగొట్టి గుడివాడ వచ్చామంటూ సవాల్‌ విసిరారు. వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌వీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో మరోసారి ఆమె అదే పనిచేశారు. కొడాలి నానికి చెందిన సినిమా థియేటర్ వద్ద కొందరు పాదయాత్ర వైపు రావటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

పేద కళాకారులను పాడనివ్వరు. అదే బులుగు పార్టీ వాళ్ళు నడి రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్ లు పెట్టినా, లిక్కర్ డ్రమ్ములు పెట్టినా మాట్లాడరు. విప్పుకొని తిరిగే మాధవ్ లాంటి వారికి అయితే దగ్గరుండి భద్రత కల్పిస్తారు. pic.twitter.com/af1lybiLSd

గుడివాడ సెంటర్ లో రైతుల వద్దకు వెళ్లేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు. కానీ, ఆయన రైతుల పాదయాత్ర వద్దకు చేరుకున్నారు. అదే విధంగా గుడివాడతో పాటుగా జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు రైతులకు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రకు ఏర్పాట్లు చేసారు. క్రిష్ణా- గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ మాజీ ఎంపీలు – ఎమ్మెల్యేలు రైతుల మహా పాదయాత్రలో వారికి సంఘీభావంగా నిలిచారు.

కొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర సాగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని కారు పైన కూర్చొని ముందుకు సాగారు. గుడివాడ పట్టణానికి వచ్చామని దాక్కున్న కొడాలి నాని బయటకు రావాలంటూ టీడీపీ నేత ఆనందబాబు సవాల్ చేసారు.అంతకు ముందు గుడివాడ పట్ణణంలో యాత్రకు మద్దతుగా టీడీపీ – జనసేన- వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు మద్దతుగా తరలి వచ్చారు హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని పోలీసులు వారికి సూచించారు.

గుడివాడ పట్టణంలో సెక్షన్ 30 అమల్లో ఉందని, కోర్టు సూచించిన వారి కంటే ఎక్కువ మందిని అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేసారు. గుడివాడ పట్టణం, నెహ్రూ చౌక్ మీదుగా యాత్ర ఏలూరు రోడ్డుకు చేరింది. అమరావి మద్దతు దారుల నినాదాలు – సవాళ్లతో గుడివాడ పట్టణం దద్దరిల్లింది. వైసీపీ నేతలే రెచ్చగొట్టే విధంగా..కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, తాము సంయమనంతో వ్యవహరించామని అమరావతి జేఏసీ నేతలు చెబుతున్నారు.

గుడివాడలో పాదయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ముందుగానే పోలీసులు అంచనాకు వచ్చి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. అటు..కొడాలి నాని కూడా టీడీపీకి తాను లక్ష్యంగా మారటంతో.. రైతుల పాదయాత్ర పేరుతో తన నియోజకవర్గంలో రాజకీయ యాత్ర చేయిస్తున్నారంటూ అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర మరి కొద్ది రోజులు కొనసాగనుంది.