కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

భార‌తీయ జ‌న‌తాపార్టీకి మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన ఎన్నికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితికి, కాంగ్రెస్ పార్టీకి ఇది లీగ్ మ్యాచ్ లాంటిది. అయితే.. బీజేపీకి మాత్రం సెమీఫైనల్‌గా మారింది. ఫైనల్ లో నిలవాలంటే ఇక్కడ గెలావాల్సిందే. ఇక్క‌డ గెలిచి తెలంగాణ ప్ర‌జ‌లంతా బీజేపీవైపే ఉన్నార‌ని నిరూపించేందుకు ఆ పార్టీ నేత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తెలంగాణ‌ను కైవ‌సం చేసుకోవాలంటే ఇది గెలిచి చూపించాల్సిన ప‌రిస్థితికి తీసుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిచేత పార్టీకి, శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయించినందుకు ఆ పార్టీకి మునుగోడు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్కడ విజయం సాధించడంద్వారా ఆ పార్టీ ప్ర‌జ‌లంద‌రికీ ఒక మెసేజ్ పంపించాల‌నుకుంటున్న త‌రుణంలో బీజేపీకి ఊహించ‌ని షాక్ కోమ‌టిరెడ్డి నుంచే త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్న కోమ‌టిరెడ్డి వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు పెడితే త‌ప్పేంట‌ని రైతుల‌ను ఎదురు ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.

వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు బిగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. అయితే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల నుంచి దీనికి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ముఖ్యంగా తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మోటార్లు బిగించ‌మ‌ని కేంద్రం చెబుతోంద‌ని, అలా చేయ‌డంవ‌ల్ల రైతుల‌కు ఉరివేసిన‌ట్లేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌లు రైతుల్లోకి, ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయాయి. వాస్త‌వానికి ఈ నిబంధ‌న‌ను అన్ని రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ బీజేపీ పాల‌న లేని రాష్ట్రాల్లో మ‌రింత తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మోటార్ల‌కు విద్యుత్తు మీట‌ర్లు బిగింపును వ్య‌తిరేకిస్తోంది.

మోటార్లకు మీటర్లు బిగించ‌డంవ‌ల్ల ఏదో జ‌రిగిపోతుంద‌నే ఆందోళ‌న రైతుల్లో నెల‌కొనడం స‌హ‌జం. రాజ‌గోపాల్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్య‌లు చేశారో అప్ప‌టి నుంచి ఆ పార్టీలో ఆందోళ‌న ప్రారంభ‌మైంది. రేపు బీజేపీ అధికారంలోకి వ‌స్తే మీట‌ర్లు బిగించ‌డం త‌ప్ప‌దు అన్న‌ట్లుగా రాజ‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మీటర్ల కోసం ఒక‌ప్పుడు గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన కేంద్రం ఇప్పుడు దాన్ని ప‌ట్టించుకోవ‌డంలేదు. రైతుల‌కు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నా వారు ఎంత వాడుకుంటున్నార‌నేది లెక్క తేలుతుంద‌ని చెప్పి వదిలేసింది. ప్ర‌తి మోటారుకు మీట‌రు బిగించ‌డంవ‌ల్ల అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని ఇక్క‌డి పార్టీల‌కు తెలుసు. కానీ ఏదో జ‌రిగిపోబోతోంది అనే భావ‌న‌ను రైతుల్లో క‌లిగించ‌డంవ‌ల్ల వారికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌తాయి. మునుగోడు ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో వేచిచూడాల్సి ఉంది.!!