కేంద్ర మంత్రులకు తెలంగాణ బాధ్యతలు – నియోజకవర్గాల్లో మకాం..!!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సస్ కేంద్రం అన్నట్లుగా మారిన పరిస్థితులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం అవుతూ..వచ్చే ఎన్నికలకు శ్రేణులను సిద్దం చేసే బాధ్యతల కోసం కేంద్ర మంత్రులను బీజేపీ నాయకత్వం రంగంలోకి దించింది.

ఇప్పటికే బీజేపీ అనుంబంధ సంస్థల నేతలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో తమకు అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా వాటి పైన నేతలు ఫోకస్ పెట్టారు.

గత జూలైలో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమయంలోనే కేంద్ర మంత్రులు తెలంగాణలో నిరంరతం పర్యటనలు చేయాలని అధినాయకత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయడం, వాటి అమలు తీరును సమీక్షిస్తూనే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును టార్గెట్ చేయటం వారికి అప్పగించిన వాటిల్లో ప్రధానమైనవి.

తెలంగాణ వ్యవహారాలను స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నాలుగు నెలల వ్యవధిలో మూడు సార్లు రాష్ట్ర పర్యటనకు రాగా, మరో 18 మంది కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు.వీరిలో 10 మంది వారికి కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు, మూడు రోజుల పాటు పర్యటించారు.

ఇక, పార్లమెంటు ప్రవాస్‌ యోజన రెండో విడతలో భాగంగా ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, బీఎల్‌ వర్మ రాష్ట్రానికి వచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ మరో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..రాష్ట్రంలో రానున్న రోజుల్లో కేంద్ర మంత్రులు మరింత పర్యటనలు చేసే అవకాశం ఉంది. రానున్న 15రోజుల వ్యవధిలో మరో ఏడుగురు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కేడర్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతోనూ వారు భేటీ అవుతున్నారు.

ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతుగా ఇప్పటిదాకా 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మంత్రుల పర్యటనలను టీఆర్ఎస్ కౌంటర్ చేస్తోంది. తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏం తెస్తున్నారని నిలదీస్తోంది. మునుగోడు బై పోల్ లో గెలవటం ద్వారా సైకలాజికల్ గా రాష్ట్ర రాజకీయాల్లో పై చేయి సాధించవచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న సమయంలో బీజేపీ నేతలు ప్రతి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.