ఎన్టీఆర్ అవసరం మాకు లేదు-విజయవాడలో పోస్టర్ల కలకలం: చంద్రబాబు-వైస్రాయ్ ఎపిసోడ్ గుర్తు చేసేలా!

విజయవాడ: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చుట్టే తిరుగుతున్నాయి. ఈ హెల్త్ యూనివర్శిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరిరోజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో ఆరంభమైన ఈ వివాదం ఇప్పటికీ సద్దుమణగట్లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీలు దీనిపై స్పందించాయి. టాలీవుడ్ నుంచి కూడా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు- ఈ విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొడతున్నారు. మంత్రులు ఆర్ కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, డాక్టర్ సీదిరి అప్పల్రాజు, అమ్జాద్ బాషా, విడదల రజిని, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని.. ఇలా మెజారిటీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు టీడీపీపై కౌంటర్ అటాక్‌కు దిగారు. దీనితో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇదంతా ఒక ఎత్తు కాగా- విజయవాడలో కొత్తగా పోస్టర్లు వెలవడం మరో ఎత్తు. బాబు: వుయ్ డోన్ట్ నీడ్ ఎన్టీఆర్.. అంటూ గతంలో వైస్రాయ్ కుట్ర సమయంలో చంద్రబాబు- ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశానికి సంబంధించిన పోస్టర్లు అవి. ఈ ఇంటర్వ్యూను దక్కన్ క్రానికల్ పతాక శీర్షికన ప్రచురించింది. ఆ పేపర్ క్లిప్పింగ్‌కు చెందిన పోస్టర్లు ఇప్పుడు తాజాగా విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తోన్నాయి.

విజయవాడలో జనసమ్మర్థంతో కూడుకుని ఉండే దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోస్టర్లు వెలిశాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదం చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకొనే విజయవాడలో ఈ పోస్టర్లు కనిపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రమేష్ హాస్పిటల్స్, బెంజ్ సర్కిల్, సిద్ధార్థ్ కాలేజీ, సత్యనారాయణపురం, గన్నవరం, కృష్ణలంక, పటమట, అజిత్‌సింగ్ నగర్, విద్యాధరపురం, గవర్నరు పేట.. వంటి పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి.

ప్రస్తుతం విజయవాడలో దసరా పండగ కోలాహలం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు విజయవాడకు చేరుకోవడం ఒకట్రెండు రోజుల్లో ఆరంభమౌతుంది. ఇలాంటి వాతావరణంలో బాబు: వుయ్ డోన్ట్ నీడ్ ఎన్టీఆర్.. అనే పోస్టర్లు నగరవ్యాప్తంగా కనిపిస్తోండటం చర్చనీయాంశమౌతోంది. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వారు ఆసక్తిగా వాటిని తిలకిస్తోన్నారు.

ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారనేది తెలియరావట్లేదు. దక్కన్ క్రానికల్‌లో చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ పతాక శీర్షికకు సంబంధించిన సమాచారం తప్ప వాటిపై మరెలాంటి పేర్లు గానీ, అసోసియేషన్లు గానీ, ఇతర వివరాలు గానీ లేవు. ఎన్టీఆర్ సానుభూతిపరులు వీటిని ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ పేరు మార్పు వ్యవహారంలో టీడీపీ నాయకులు అటు జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తోండటంతో ఆయన అభిమానులైనా ఈ పోస్టర్లను తెర మీదికి తెచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోన్న ఈ పరిస్థితుల్లో- అదే ఎన్టీఆర్‌ను అదే చంద్రబాబు- తెలుగుదేశం పార్టీ ఏరకంగా వెన్నుపోటు పొడిచింది..?, ఆయనను ఎలా పదవీచ్యుతుడిని చేసింది?, టీడీపీని ఎలా తమ చేతికి తీసుకోగలిగిందనే విషయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసినట్టయింది. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను దించేసి- చంద్రబాబు ఎలా పార్టీని, ముఖ్యమంత్రి స్థానాన్ని ఎలా హస్తగతం చేసుకున్నాడనేది కళ్లకు కట్టినట్టు వివరించినట్టయింది.