ఉప్పల్ మ్యాచ్: రూ. 850 టికెట్లు రూ. 11 వేలకు విక్రయం, ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్లాక్ టికెట్స్ దందా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 టికెట్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను గుగులోత్ వెంకటేశ్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్‌గా గుర్తించారు. నిందితులు రూ. 850 టికెట్లను రూ. 11 వేలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, టికెట్ల కోసం రెండ్రోజుల క్రితం జనం ఎగపడటంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

ఇది ఇలావుండగా, ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో హైదరాబాద్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు, ఉప్పల్ మైదానం వద్ద 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మైదానం చుట్టుపక్కల 15 కి.మీ మేర నిఘా ఏర్పాటు చేశారు. సుమారు 300 కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూంతో అనుసధానం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.