అమరావతి రైతులపై దాడి చేస్తే సరైన రీతిలో..

శాస‌న‌స‌భ సాక్షిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత స‌త్య‌కుమార్ ఆరోపించారు. త‌న అస‌మ‌ర్థ పాల‌న‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి కొత్త కొత్త నాట‌కాల‌కు తెర‌లేపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ‌ప‌ట్నంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం పేరు మారుస్తూ కొత్త నాట‌కం ఆడుతున్నార‌ని, ఇంత పేర్ల పిచ్చి ఉన్న పార్టీని తానెక్క‌డా చూడ‌లేద‌న్నారు. చివ‌ర‌కు పుట్ట‌బోయే బిడ్డ పేరు కూడా మార్చాలంటారేమోన‌ని, అభివృద్ధి అంటే పేర్లు మార్చ‌డ‌మా? ఊర్లు మార్చ‌డ‌మా? అని ప్ర‌శ్నించారు.

అసెంబ్లీ నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కు 60 రోజుల‌పాటు అమ‌రావ‌తి చేతులు చేస్తున్న పాద‌యాత్ర విజ‌య‌వంత‌మ‌వుతోంద‌న్నారు. దీన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించేందుకే ముఖ్య‌మంత్రి యూనివ‌ర్సిటీ పేరు మార్చార‌న్నారు. రైతుల పాద‌యాత్ర‌కు త‌మ పార్టీ మ‌ద్ద‌తు ప‌లికింద‌న్నారు. రైతుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని, పాద‌యాత్ర‌లో రైతుల‌పై దాడికి కుట్ర చేస్తే గ‌ట్టి జ‌వాబు చెబుతామ‌ని హెచ్చ‌రించారు. ఈ మూడు సంవ‌త్స‌రాల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జ‌రిగిందో వైసీపీ నేత‌లు చెప్పాల‌ని స‌త్య‌కుమార్ స‌వాల్ విసిరారు. ఉత్త‌రాంధ్ర‌కు ఒక్క ప‌రిశ్ర‌మ‌ను కూడా తీసుకురాలేద‌ని, జూట్ మిల్లు, షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని మూయించార‌న్నారు. చివ‌ర‌కు ఈ ప్రాంతాన్ని గంజాయి సాగుకు అనువుగా మార్చార‌న్నారు. ఖాళీ స్థ‌లం క‌న‌ప‌డితే క‌బ్జా చేస్తున్నార‌ని, ఇంత‌వ‌ర‌కు సాగునీటి ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోలేద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు దోచుకున్న‌ది చాల‌ని, ఇక‌నైనా దోపిడీని ఆపాల‌ని స‌త్య‌కుమార్ హిత‌వు ప‌లికారు.

అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న యాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో పూర్తవుతుంది. ఈ యాత్రపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయన కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందన్నారు. కానీ తాము అలా చేయమన్నారు.