Nagarjuna Akkineni తో రొమాన్స్, లిప్ లాక్స్.. ది ఘోస్ట్‌లో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అలా.. సోనాల్ చౌహాన్ ఇంటర్యూ

F3 చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన తర్వాత ప్రపంచాన్ని కోవిడ్ వెంటాడింది. దాంతో నాకు చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తున్నది. అయితే నాకు ప్రవీణ్ సత్తారు నుంచి కాల్ రాగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే.. నాకు ఎప్పటి నుంచో ఒక యాక్షన్ సినిమా చేయాలనే కోరిక ఉండేది. ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ సినిమా యాక్షన్ సినిమా అని చెప్పగానే దాదాపు చేయాలని డిసైడ్ అయ్యాను అని సోనాల్ చౌహాన్ తెలిపింది. నాగార్జున అక్కినేని, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ…

నాగార్జున అక్కినేనితో నటించడం, ది ఘోస్ట్ సినిమా ఆఫర్ నాకు రావడం ఓ డెస్టిని. ఎందుకంటే.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేయాల్సింది. అయితే ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా చేయలేకపోయారు. దాంతో ఈ ఆఫర్ నాకు వచ్చింది. ది ఘోస్ట్ సినిమాలో నాగార్జున అక్కినేని హీరోగా అని చెప్పగానే ఇక ఈ సినిమా గురించి మరో ఆలోచన లేకపోయింది. అని సోనాల్ చౌహాన్ వెల్లడించింది.

ది ఘోస్ట్ సినిమాలో నేను ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటించాను. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్లుకు స్కోప్ ఉంది. ఈ సినిమా కోసం శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకొంటున్న నేపథ్యంలో రెండో రోజే కాలికి గాయపడ్డాను. అయితే డాక్టర్‌ను కలిస్తే ఎక్స్‌రే తీసి ఆరు వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆ మాట వినిగానే నేను కంగారు పడ్డాను. ఇప్పటికే ఓ హీరోయిన్ చేయలేకపోయింది. ఇప్పుడు నాకు గాయమైందనే ఆలోచనల్లో పడ్డాను. అయితే ఇంట్లో చెప్పకుండా నేను నా ప్రాక్టీస్ మెల్లమెల్లగా చేశాను అని సోనాల్ చౌహాన్ తెలిపింది.

ది ఘోస్ట్ సినిమాలో గన్స్‌ ఉపయోగించాల్సి రావడం జరిగింది. నేను ఎక్కువగా గన్స్ ఆపరేట్ చేయడం గురించి శిక్షణ తీసుకోలేదు. మా నాన్న పోలీస్ ఆఫీసర్. కాబట్టి.. నేను అంతకు ముందే ఏకే 47 లాంటి గన్స్ చూశాను. వాటి గురించి కొంత తెలుసు. అందుకే నాకు పెద్దగా ట్రైనింగ్ అవసరం లేదని అనుకొన్నాను. కానీ ప్రవీణ్ సత్తారును కలిసిన తర్వాత నాకు గన్స్ గురించి ఏమీ తెలియదని అర్ధమైంది. ఆ తర్వాత నాతో గన్ పట్టించి.. రెండు నిమిషాలు చూసి.. నీవు ఈ సినిమాలో నటిస్తున్నావని చెప్పారు. అదే నాకు జరిగిన ఆడిషన్. ఆ తర్వాత ఇంటెన్సివ్‌గా ట్రైనింగ్ జరిగింది అని సోనాల్ చౌహాన్ చెప్పింది.

నాగార్జున అక్కినేనితో సినిమా చేస్తున్నాననే తెలిసిన తర్వాత కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను. ఆయన సీనియర్ హీరో. ఎలా ఉంటారో అనే భయం కలిగింది. అయితే ఆయనను కలిసిన 10 నిమిషాల తర్వాత అలాంటి భయాలే కలుగలేదు. ఆయన నా వయస్సు ఉన్న వ్యక్తిలా బిహేవ్ చేశారు. నాగార్జునకు కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటారు. ఆయనతో నా కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయిందో ప్రేక్షకులే చెప్పాలి. ఆయనతో రొమాంటిక్ సీన్లు బాగా వచ్చాయి. ఈ సినిమా యాక్షన్ ఫిలిం కావడంతో ఆయనతో పూర్తి స్థాయిలో రొమాంటిక్ ఫిలిం చేయాలనిపించింది. లిప్‌లాక్స్ ఉన్నాయా? లేదా అనేది సినిమా చూస్తే తప్ప.. మీకు అసలు విషయం తెలుస్తుంది. లిప్‌లాక్ ఉందని చెప్పను.. లేవని కూడా అనను అని సోనాల్ చౌహాన్ అంది.

ది ఘోస్ట్ సినిమాలో నేను ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాపై ఉన్న ప్రేక్షకులకు ఉన్న అభిప్రాయం ఈ సినిమాతో మారిపోతుంది. టైగర్ జిందా హై సినిమాలో కత్రినా కైఫ్‌ చేసిన క్యారెక్టర్‌తో ఎలాంటి పోలీకలు లేవు. ఇండియాలో హీరోయిన్లు చాలా తక్కువ మంది యాక్షన్ సినిమాలు చేశారు. కాబట్టి.. కంపారిజన్స్ రావడం సహజం. ఆ సినిమా కథ వేరు.. ఈ సినిమా కథ వేరు అని సోనాల్ చౌహాన్ చెప్పింది.