హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత??

కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కుటుంబం వ‌ల్లే హైదరాబాద్‌ క్రిక్‌ట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయ‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత వివేక్‌ వెంకటస్వామి మండిప‌డ్డారు. ఎమ్మెల్సీ కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిగా చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. భారత్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగే మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి ఎన్ని టికెట్లు విక్రయించారో ప్ర‌జ‌ల‌కు, అభిమానుల‌కు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాచ్‌ టికెట్లు విక్రయించామని చెబుతున్నార‌ని.. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఎన్ని బాక్స్‌లు, ఎంత మందికి కేటాయించారు? డబ్బులు చెల్లించిన వారికి బాక్స్‌లు ఇచ్చారా? లేదా? వాటి వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించింది ఎవ‌రు? ఎందుకు అతి త‌క్కువ టికెట్లు అమ్మారు? త‌దిత‌ర విషయాలపై ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇవ్వాల‌న్నారు. గ‌తంలో ఎప్పుడూ ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు హెచ్‌సీఏలో చోటుచేసుకోలేద‌న్నారు. తాజాగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌కు కార‌ణం క‌ల్వ‌కుంట్ల కుటుంబ‌మేన‌ని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రీడా రంగాల్లో కేటీఆర్ పేరు, లేదంటే క‌విత పేరు ఉండేలా చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వివేక్ మండిప‌డ్డారు. గ‌తంలో తాను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా నిల‌బ‌డ‌తాన‌ని చెప్పాన‌ని, హెచ్‌సీఏ మీకెందుకు.. వ‌ద్దు మీరు పోటీచేయొద్ద‌ని కేసీఆర్ అన్నార‌ని ఈ సంద‌ర్భంగా వివేక్ గుర్తుచేశారు.

మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కోసం హెచ్ సీఏ కేవలం ఆఫ్ లైన్ లో 2వేల టికెట్లను అమ్మింది. మిగతా టికెట్లు ఏమయ్యాయి? ఆన్ లైన్ లో ఎందుకు అమ్మలేదు.. తదితర విషయాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ దగ్గర సమాధానం లేదు. అన్ని టికెట్లు అయిపోయాయన్నారు. టికెట్ల కోసం అభిమానులు ఎగబడటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 20 మంది గాయపడ్డారు.