హెల్మెట్ పెట్టుకుని బస్సు నడిపిన బస్సు డ్రైవర్.. పెద్ద కారణమే ఉంది గురూ!!

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈడీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఎన్ఐఏ అధికారులు పిఎఫ్ఐ ఫై సంస్థలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏకకాలంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద దాడులలో ఇప్పటికే పిఎఫ్ఐ కు సంబంధించిన అనేక మంది నాయకులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఎన్ఐఏ మరియు ఈడి దాడులను నిరసిస్తూ కేరళలో బంద్ నిర్వహించారు పీఎఫ్ఐ కార్యకర్తలు. కేరళలో పిఎఫ్ఐ నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఇక ఈ హింసాత్మక ఘటనల సమయంలోనూ ఆసక్తికర దృశ్యం అందరినీ ఆకర్షించింది.

పీఎఫ్ఐ బంద్ నిర్వహిస్తున్న క్రమంలో విధినిర్వహణ చేయడం ప్రజా రవాణా కార్మికులకు, ముఖ్యంగా సవాలుగా మారింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) శుక్రవారం పిలుపునిచ్చిన బంద్ హింసాత్మకంగా మారడంతో రాష్ట్రానికి చెందిన కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్‌టిసి) కు చెందిన బస్సు డ్రైవర్ రాళ్లు రువ్వేవారి నుండి రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు హెల్మెట్ పెట్టుకుని బస్సును నడుపుతూ కనిపించారు.

KSRTC driver in #Kerala wore a helmet while driving the bus to save himself from the stone pelting by the #PFI workers as organisation called for a whole day of hartal in the state. The incident was reported from Aluva.indiatvnews#PFICrackdown#NIARaids #Hartal pic.twitter.com/19IlQedLEf

యూనిఫామ్ ధరించిన బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. డ్రైవర్ ఎర్నాకులం లోని అలువా ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల నేపధ్యంలో తనను తాను రాళ్ళ దాడి నుండి కాపాడుకోవటానికి బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించినట్టు తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని, టెర్రర్ ఫండింగ్ చేస్తున్నారని పి ఎఫ్ ఐ కార్యాలయాలపై, సభ్యుల ఇళ్లపై దాడులు చేసి వారిని అరెస్టు చేసిన తరువాత కేరళలో పి ఎఫ్ ఐ నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనకారులు అనేక కేరళ ఆర్టీసీ బస్సుల పై, ఇతర వాహనాల పై దాడులకు పాల్పడ్డారు. రాళ్ల దాడులతో కొంతమంది బస్సు డ్రైవర్లు గాయపడినట్టు వార్తలు వచ్చాయి.

బస్సులను, ప్రైవేటు వాహనాలను మాత్రమే కాకుండా, రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేశారు. కొల్లాంలో ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. తిరువనంతపురం, కొల్లం, కోజికోడ్, అలప్పుజ లలో బస్సులపై దాడులు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాయి.

అనుమతి లేకుండా బంద్ కు పిలుపునిచ్చిన పిఎఫ్‌ఐ నాయకులపై కేరళ హైకోర్టు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేసింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న కారణంగా, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అనుమతి లేకుండా ఎవరూ బంద్ కు పిలుపునివ్వరాదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బంద్ కు మద్దతు ఇవ్వని వారిపై దాడులు జరగకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.