స్క్రిప్ట్ చదివి త్రివిక్రమ్ ఏం చెప్పారంటే? స్వాతిముత్యం దర్శకుడు లక్ష్మణ్ (ఇంటర్వ్యూ)

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా, అందాల భామ వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నూతన దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం స్వాతి ముత్యం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ గణేష్, దర్శకుడు లక్ష్మణ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమైన ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ మీడియాతో మాట్లాడుతూ..

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మా స్వస్థలం. గుంటూరులో ఇంజినీరింగ్ చదువుతూ సినిమాలపై ఇష్టంతో మధ్యలోనే వదిలేశాను. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి డ్రామాలకు స్క్రిప్టు రాసేవాడిని. హైదరాబాద్ రాకముందే కాకినాడలో షార్ట్ ఫిలింస్ చేసేవాడిని. ఆ తర్వాత మా ఫ్రెండ్స్‌లో ఒకరికి శ్రీకాంత్ అడ్డాల వద్ద అసిస్టెంట్‌గా అవకాశం రావడంతో మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్ వచ్చాం. చాలా చోట్ల ప్రయత్నించినా ఎక్కడ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్ చేస్తూ.. నా ఫ్రెండ్ ద్వారా బెల్లకొండ గణేష్‌కు కలిసి చాలా కథలు చెప్పాను. అందులో స్వాతిముత్యం కథ నచ్చింది. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్, చిన్నబాబుకు నచ్చడంతో సితారా బ్యానర్‌లో ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికొకరు వేసుకొనే సెటైర్స్ చాలా ఫన్‌గా ఉంటాయి. మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ కథ పుట్టింది. ఇంట్లో ఏదైనా జరిగే ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఎలా స్పందిస్తారు అనే అంశాల ఆధారంగా కథ రాసుకొన్నాను. ఈ కథలో హీరో బాలమురళీ కృష్ణ చాలా అమాయకుడు. ఇంజినీరింగ్ పూర్తయ్యి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఓ యువకుడికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటం.. దాని వల్ల ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఈ కథలో ప్రధానమైన పాయింట్ అని లక్ష్మణ్ చెప్పారు.

స్వాతిముత్యం టైటిల్ ఈ సినిమాకు పెట్టడం నా నిర్ణయం కాదు. నిర్మాత చినబాబు గారి నిర్ణయం. కథలో హీరో అమాయకుడిగా ఉండటంతో ఈ టైటిల్‌ను పెట్టమని సలహా ఇచ్చారు. చాలామంది అమాయకులతో కథ నడుస్తుంది. కమల్ హాసన్ నటించిన పాపులర్ మూవీ టైటిల్ పెట్టే సాహసం నేను చేయలేదు. ఆ టైటిల్ పెట్టమని చెప్పినప్పుడు కొంత కంగారు పడ్డాను. చినబాబు ధైర్యం ఇవ్వడంతో ఈ టైటిల్‌ను ఖరారు చేశాం అని దర్శకుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.

స్వాతి ముత్యం సినిమా ఫస్ట్ కాపీ చూశాను. అవుట్ పుట్ చూసుకొన్న తర్వాత అప్పటి వరకు ఉన్న అనుమానాలు భయాలు తొలగిపొయాయి. ఈ సినిమా స్క్రిప్టు అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ చదివారు. స్క్రిప్టు చదివిన తర్వాత బాగా రాశారు. సినిమా కథ బాగుంది. పాత్రలు, సంఘటనలు, ట్విస్టు చాలా బాగుందని ప్రశంసించారు. దాంతో నాకు మరింత నమ్మకం కలిగింది అని లక్ష్మణ్ తెలిపారు.

అక్టోబర్ 5వ తేదీన స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, విష్ణు మంచు నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాకు చిరంజీవి అంటే అభిమానం. ఆయన సినిమాపై పోటీగా వేయడం లేదు. ఆయన సినిమాతోపాటు వస్తున్నాం. ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమాతోపాటు నా సినిమా రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది అని లక్ష్మణ్ కే కృష్ణ చెప్పారు.