శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం – 27న తిరుమలకు సీఎం జగన్..!!

తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు సంబంధించిన రంగం సిద్దమవుతోంది. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారని టీటీడీ పాలక మండలి అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనాల విషయంలో క్లారిటీ ఇచ్చింది టీటీడీ. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల దర్శనాన్ని రద్దుచేయడంతో పాటు, వీవీఐపీలు, వీఐపీ దర్శనంలోనూ పరిమితులు విధించింది.

సెప్టెంబ‌ర్ 25 వ తేదీన బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నున్న‌ది. 27 వ తేదీన ధ్వ‌జారోహణంతో పాటు బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం అవుతాయి. 27 వ తేదీ మ‌ధ్యాహ్నం మాడ‌వీధుల్లో గ‌రుడ‌ప‌ఠం, ప‌రివార దేవ‌త‌ల ఊరేగింపు జ‌రుగుతుంది. బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. 27వ తేదీ రాత్రి 9 గంట‌ల‌కు శ్రీవారు పెద్ద శేష వాహ‌నంపై మాడ‌వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. అదే విధంగా.. ఈ నెల 28న తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు చిన్న శేష వాహ‌నంపైన‌, అదేరోజు రాత్రి 7 గంట‌ల‌కు హంస వాహ‌నంపైన శ్రీవారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఆ మరుసటి రోజు 29 వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు సింహ‌వాహ‌నంపై, రాత్రి 7 గంట‌ల‌కు ముత్య‌పు పందిరి వాహ‌నంపై శ్రీవారు భ‌క్తుల‌కు ద‌ర్శనం ఇస్తారు.

30 వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై, రాత్రి 7 గంట‌లకు స‌ర్వ‌భూపాల వాహ‌నంపైన‌, అక్టోబ‌ర్ 1 వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు మోహినీ అవతారంలోనూ, రాత్రి 7 గంట‌ల‌కు గ‌రుడ వాహ‌నంపైన స్వామివారు ద‌ర్శ‌నం ఇస్తారు. అక్టోబ‌ర్ 2 వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌నంపై, సాయంత్రం 5 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై, రాత్రి 7 గంట‌ల‌కు గ‌జ‌వాహ‌నంపైన‌, అక్టోబ‌ర్ 3 వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై, రాత్రి 7 గంట‌ల‌కు చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. అక్టోబ‌ర్ 4 వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నున్న‌ది. అదేవిధంగా రాత్రి 7 గంట‌ల‌కు అశ్వవాహ‌నంపై శ్రీవారు ఊరేర‌గ‌నున్నారు. అక్టోబ‌ర్ 5 వ తేదీన ఉద‌యం 6 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం, రాత్రి ధ్వ‌జ అవ‌రోహ‌నంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాని ఆలయ పాలక మండలి వెల్లడించింది. గతంలో కరోనా కారణంగా నిబంధనల నడుమ ఉత్సవాలు జరిగాయి. ఈ సారి సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది.