వైసీపీ ఎమ్మెల్యేకు అస‌మ్మ‌తి సెగ‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ గ‌ట్టిగా తగిలింది. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం గుడివాడలో ప‌లు శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన హాజర‌య్యారు. నాడు-నేడు, అంగ‌న్‌వాడీ కేంద్రం త‌దిత‌రాల శంకుస్థాపనకు రాగా వైసీపీలోని మరో వర్గం ఎమ్మెల్యేను అడ్డుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు త‌లెత్తాయి. ప్ర‌భుత్వం త‌రఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు త‌మ‌కు ఎందుకు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని వారంతా ప్ర‌శ్నించారు. పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, స‌ర్పంచులు తదితర నాయకులు బాబూరావును నిల‌దీశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్‌.. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

గుడివాడ సర్పంచి శ్రీనుబాబు, రాయవరం మండల ఉపాధ్యక్షుడు చోడిపల్లి అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, ఇతర నాయకులు ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు బైఠాయించారు. వారిని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త త‌లెత్తింది. ఇరువర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. దీంతో శ్రీనుబాబుకు గాయాల‌య్యాయి. జ‌డ్పీటీసీ, వైస్ ఎంపీపీ సొమ్మ‌సిల్లారు. అంద‌రినీ పోలీసులు చెద‌రగొట్ట‌డంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు శంకుస్థాప‌న నిర్వ‌హించి వెనుతిరిగారు. పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీలోని నాయకులంతా వర్గాలుగా విడిపోయి పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ అధిష్టానం ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. అయినా మరోసారి అసమ్మతి తలెత్తడంతో రానున్న ఎన్నికలు ఎమ్మెల్యేకు క్లిష్టంగా మారతాయనే భావనలో అధిష్టానం ఉంది. ఒకసారి పిలిపించి మాట్లాడాలని నేతలు నిర్ణయించుకున్నారు.