వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు – ఎవరికి..!!

మరోసారి వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ అవార్డులను ఎంపిక చేయటానికి ఏర్పాటైన హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ విజయవాడలో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 59 మందిని ఎంపికైన వారికి అవార్డుల ప్రధానం జరిగింది. ‘ వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైయ‌స్ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022’ అత్యున్నత పురస్కారాల పలు రంగాలకు చెందిన వారు.. విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులతో పాటుగా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని అవార్డులకు ఎంపిక చేయనున్నారు. ఈ కమిటీ సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తో పాటుగా పలువురు అధికారులు ఉన్నారు. కీలక రంగాల్లో నైపుణ్యం సాధించటంతో పాటుగా.. విశేష ప్రతిభా పాటవాలు కలిగిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు కమిటీ ప్రకటించింది. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ-విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తులను వారి పూర్తి వివరాలతో బయోడేటాను secy&[email protected] కు మెయిల్‌ చేయాలని కమిటీ సభ్యులు సూచించారు. వైయ‌స్ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ కింద రూ.10 లక్షల నగదు, వైయ‌స్ఆర్‌ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. వైయ‌స్ఆర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించనున్నారు. ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువుగా నిర్ణయించారు. నవంబర్ 1న అవార్డుల ప్రధానం జరగనుంది.