రెండ్రోజుల్లో 1140 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: హరీశ్ రావు, మరిన్ని ఉద్యోగాలు కూడా

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరిన్ని పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 30 టీచింగ్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు, నర్సులకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడారు.

మెడికల్ కాలేజీల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరో రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. రెండు నుంచి మూడు నెలల్లో ఉద్యోగాల భర్తీచేస్తామన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

వీటితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ)లోనూ వైద్యుల కొరత తీర్చేందుకు మరో 10 రోజుల్లో 1000 మంది వైద్యులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

మరోవైపు, ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి సోమవారం ఆ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌లను నియమించనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ 7 శాతం ఉంటే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 10శాతంగా ఉందని తెలిపారు.

వైద్యసేవల విషయంలో రోగులను సంతృప్తిపర్చటమే అంతిమంగా వైద్యసిబ్బంది లక్ష్యమని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. వైద్యులకు, స్టాఫ్‌ నర్సులకు ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, వైద్యసేవల పట్ల వారికి దిశానిర్దేశం చేశారు మంత్రి హరీశ్ రావు.