రాహుల్ భారత్ జోడో యాత్రలోకి సోనియా, ప్రియాంక- ఎక్కడ కలుస్తారో తెలుసా?

బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడులో పూర్తియిన ఈ యాత్ర… కేరళలో కొనసాగుతోంది. ఇది త్వరలో కర్ణాటకలో ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ ఆయనతో కలవబోతున్నారు.

ఒక్కరోజు బ్రేక్ తర్వాత కేరళలోని పెరంబ్రా నుంచి తిరిగి ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర.. 17వ రోజు కొనసాగుతోంది. ఇవాళ 12 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత అంబల్లూరు జంక్షన్ లో ముగియనుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు టాలోర్ బైపాస్ జంక్షన్ నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి థిస్సూర్ వడక్కుమ్ నాథన్ ఆలయం వద్ద ముగియనుంది. ఇలా కేరళలో సాగే యాత్ర కర్నాటకలో ఈ నెల30న ప్రవేశించబోతోంది. ఆ తర్వాత రాహుల్ తల్లి సోనియా, సోదరి ప్రియాంక ఆయన్ను కలవబోతున్నారు.

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సెప్టెంబరు 30న రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటారని కర్నాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్ తెలిపారు. అయితే ఏ రోజు వీరిద్దరూ రాహుల్ తో కలుస్తారనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.

కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. “సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ చేసిన ఏర్పాట్లపై ఏఐసీసీ సంతృప్తి చెందిందన్నారు. యాత్ర సెప్టెంబర్ 7 న ప్రారంభమైంది. అలాగే, దానికి మంచి స్పందన లభించిందన్నారు.