మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్-త్వరలో స్పామ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్ లు బంద్-టెలికాం బిల్లుతో

దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య స్పామ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్ లు. బిజీబిజీగా సాగిపోతున్న మన జీవితాల్లో మొబైల్ ఫోన్ తెచ్చిపెట్టిన సౌకర్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఫేక్ మెసేజ్ లు, కాల్స్ తో వినియోగదారుల్ని చికాకుపెడుతున్న ఈ నకిలీలపై కేంద్రం కొరడా ఝళిపించబోతోంది. కేంద్రం త్వరలో తీసుకొస్తున్న టెలికాం బిల్లుతో ఇలాంటి స్పామ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్ లకు చెక్ పడబోతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

భారత్ లో ప్రస్తుతం వినియోగదారులు వాడుతున్న మొబైల్ ఫోన్స్ లో వారు చేసుకునే కాల్స్ కంటే, మెసేజ్ ల కంటే వారికి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న స్పామ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్ ల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. దీంతో వినియోగదారులు ట్రూకాలర్ తో పాటు మరికొన్ని కొత్త యాప్ లను అదనంగా ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని మరీ వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా పలు సందర్భాల్లో సాధ్యం కావడం లేదు. దీంతో వీటికి అడ్డుకట్ట వేయాలనే ఒత్తిడి కేంద్రంపై పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త టెలికాం బిల్లు తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

మొబైల్ ఫోన్ వినియోగదారులకు స్పామ్ కాల్‌లు, మోసపూరిత సందేశాల నుండి పెద్ద ఉపశమనాన్ని అందించే చర్యలో భాగంగా మెసేజ్ పంపే లేదా కాల్ చేస్తున్న వ్యక్తి గుర్తింపు రిసీవర్‌కు ఉపయోగించిన ప్లాట్‌ఫారమ్‌తో సంబంధం లేకుండా తప్పనిసరిగా కనిపించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇది మొబైల్ ఫోన్లకే కాదు ల్యాండ్ లైన్ ఫోన్లు, వాట్సాప్ వంటి సోషల్ మీడియా కాల్స్, మెసేజ్ లు చేసుకునే యాప్ లకు కూడా వర్తింపచేస్తారు.

తమ ఉత్పత్తుల ప్రమోషన్, లేదా మోసాల కోసం వినియోగదారుల్ని వేధించకుండా ఆయా వ్యక్తుల్ని, సంస్ధల్ని కట్టడి చేసేలా కొత్తగా బిల్లు తీసుకొస్తున్నట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ బిల్లులోనే కాలర్, మెసేజర్ ఐడెంటిటీ బయటపెట్టడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న టెలికాం బిల్లుపై ఇప్పటికే ఇందులో భాగస్వాములైన వారి అభిప్రాయాలు కోరింది. ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన ముసాయిదా బిల్లు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధమైన స్వాధీనం) చట్టం 1950లో మార్పులకు ప్రతిపాదిస్తోంది.

అలాగే దేశంలో టెలికమ్యూనికేషన్ రంగాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇందులో ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న ఆపరేటర్‌లకు బకాయిలను మాఫీ చేయడం, ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అవసరమయ్యే టెలికాం సేవల పరిధిలో ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫారమ్‌లను తీసుకురావడం, మెసేజ్ అంతరాయానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

ఈ కొత్త బిల్లు వచ్చే ఆరునెలల్లో పార్లమెంట్ ఆమోదం తీసుకుని చట్టంగా మారబోతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే అప్పుడు కచ్చితంగా మనకు కాల్ చేసే వారు, మెసేజ్ చేసేవారు తప్పనిసరిగా తమ వివరాలు బయటపెట్టాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కొందరు వీఐపీలు మినహా మిగతా వారంతా కాల్, మెసేజ్ చేసేటప్పుడు తమ వివరాలు కనిపించేలా పెట్టుకోవాల్సి ఉంటుంది.

దీంతో వినియోగదారులకు స్పామ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజ్ లు రావడం తగ్గిపోతాయి. ఈ కొత్త నిబంధనలతో దేశంలో ఐటీ నేరాల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంది. అప్పుడు కొత్తగా ట్రూ కాలర్ వంటి యాప్ లకు సబ్ స్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా తప్పుతుంది.