ముస్లింలలో మరో రెండు కులాలకు బీసీ రిజర్వేషన్-జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

విజయవాడ : ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల వర్తింపుపై ఇవాళ జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు ముస్లిం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అయినప్పటికీ ఇప్పటికే అమలుచేస్తుండటంతో.. కొత్త కొత్త డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో రాష్ట్ర మైనార్టీ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ప్రజలకు బీసీ- ఈ కేటగిరి కింద సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత శాఖలకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ డా.కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ అంశంపై స్పష్టతనిచ్చినట్లు ఆయనపేర్కొన్నారు. వాటి ప్రకారం ‘మొహమ్మద్’, ‘అబ్దుల్’ అనే ఇంటి పేర్లు ఉన్న ముస్లింలకు బీసీ- ఈ సర్టిఫికెట్లు జారీ చేయాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఆ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కనుక ఆ రెండు ఇంటి పేర్లు ఉన్న ముస్లింలు బీసీ- ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేయాలని ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కోరారు. ఇప్పటికే ముస్లింలలో పలు కులాలకు 4 శాతం రిజర్వేషన్ అమలవుతుండగా.. ఇప్పుడు మరో రెండు కులాలకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు పంపారు.