మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ అంతర్గత సర్వే

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన పార్టీల‌న్నింటికీ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. సిట్టింగ్ నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లోను ద‌క్కించుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ పార్టీ నిమ‌గ్న‌మై ఉంది. త‌మ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన రాజ‌గోపాల్‌రెడ్డిని ఓడించ‌డానికి శ‌త‌థా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి ఇక్క‌డ గెలిచి ప్ర‌జ‌లంతా త‌మ‌వైపే ఉన్నార‌ని నిరూపించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి.. ప్ర‌జ‌లంతా బీజేపీవైపు ఉన్నార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో గెల‌వ‌బోయేది కూడా తామేన‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఒక‌పార్టీపై మ‌రోపార్టీ స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల తో నియోజ‌క‌వ‌ర్గంలోని రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డిని త‌మ పార్టీలోకి తీసుకున్నాం కాబ‌ట్టి ఇక్క‌డ గెల‌వడం తప్పనిసరైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తిసారి నాయ‌కుల‌కు దిశా నిర్దేశం చేసి వెళుతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవానికి వచ్చిన సమయంలోను నాయకుల పనితీరు సరిగా లేదంటూ ఆగ్రహించారు.

మునుగోడులో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకునేందుకు ఆ పార్టీ అంత‌ర్గ‌తంగా స‌ర్వే నిర్వ‌హింప‌చేసింది. ఆ స‌ర్వేలో వివ‌రాల‌ను పార్టీ నేత వివేక్ వెంక‌ట‌స్వామి వెల్ల‌డించారు. ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం ఖాయమని, రెండోస్థానం కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా రాజగోపాల్ రెడ్డివైపే ఉన్నారని తమ సర్వేలో తేలిందన్నారు. మునుగోడులో ప్రధాన పాటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందించమని కోరగా అది తమకు సంబంధంలేని విషయమన్నారు. ప్రజలంతా కోమటిరెడ్డివైపే ఉన్నట్లుగా తేలిందన్నారు.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారన్నారు. కరోనా సమయంలో ఇక్కడి ప్రజలందరికీ కోమటిరెడ్డి సహాయ సహకారాలందించి అండగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన కావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోను విజయం సాధించి అధికారంలోకి రానున్నామనే ధీమాను వెంకటస్వామి వ్యక్తం చేశారు.