మరో తేనెతుట్టె కదిపిన జగన్ ? రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ ! ప్రత్యర్ధులకు నిద్రకరవు!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ వాడిన సోషల్ ఇంజనీరింగ్ మంత్రానికి కాలం చెల్లిపోయిందా ? దాని స్దానంలో మరో కొత్త అస్త్రానికి జగన్ పదునుపెట్టబోతున్నారా ? ఇప్పటికే కుల సమీకరణాలతో ప్రయోగశాలగా మారిపోయిన ఏపీలో ఏ వ్యూహం శాశ్వతం కాదని జగన్ గుర్తించినట్లు అర్ధమవుతోంది. అందుకే ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల్లో గెలుపు కోసం మరో వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకూ ఫలిస్తుందో తెలియదు కానీ జగన్ మాత్రం అస్త్రాన్ని బయటకు తీసేశారు.

కుల రాజకీయాలకు అలవాలమైన ఏపీలో ఎన్నికలంటేనే రాజకీయపార్టీలకు ఓ రకమైన వణుకు ఉంటుంది. ఎన్నికల్లో గెలవడానికి తాము అనుసరించే కుల వ్యూహాలు ఫలిస్తాయో లేదో అన్న బెరుకు ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీని స్ధాపించి ఈ రాజకీయాల్ని ఔపోసన పట్టడం మొదలుపెట్టారు వైఎస్ జగన్.

2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా రాజకీయాల్లో కాకలుతీరిన వారికి మాత్రం జగన్ వ్యూహం వెన్నులో వణుకు పుట్టించింది. అలాగని జగన్ ప్రత్యర్ధులు ఈ విషయాన్ని అప్పట్లో గ్రహించారా అంటే అదీ లేదు. ఫలితం 2019 ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం. దీని వెనుక జగన్ అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఇప్పటికీ ఆయన ప్రత్యర్ధులకు అంతుబట్టడం లేదు.

2019లో జగన్ అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ప్రత్యర్ధులకు వెంటనే అంతుబట్టలేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో జగన్ వేసిన ఎత్తులు ప్రత్యర్ధులకు ఎంతోకొంత అర్దమయ్యాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో వాటిని యథాతథంగా అనుసరించేందుకు ప్రత్యర్ధులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటినుంచే పలు నియోజకవర్గాల్లో ఈ ప్రయోగాలు ప్రారంభించారు.

దీంతో జగన్ బాటలోనే వెళ్లి ఆయన సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఛేదించేందుకు ప్రత్యర్ధులు చేస్తున్న ప్రయత్నాలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో జగన్ సైతం వ్యూహం మార్చుకోవాల్సి వస్తోంది.

జగన్ కు గతంలో ఘనవిజయం కట్టబెట్టిన సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం శాశ్వతమేమీ కాదు. దాన్ని మరోసారి యథాతథంగా అమలుచేయడం జగన్ కూ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు జగన్ దాని స్ధానంలో మరో కొత్త వ్యూహానికి తెరలేపారు. ప్రత్యర్ధి బలహీనత కనిపెట్టి ఆ వ్యూహం అమలు మొదలుపెట్టేశారు. కుప్పంలో జగన్ తాజాగా చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం.

అలాగే ఒకేసారి రెండు కార్డుల్ని జగన్ బయటకు తీశారు. అవి కుల జనాభా, స్ధానికత. కుప్పం సీటు చంద్రబాబుది కాదు బీసీలది అన్న జగన్, ఆ తర్వాత చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్ అని చెప్పేశారు. దీంతో కుల జనాభా ఆధారంగా, స్ధానికత ఆధారంగా సీట్ల కేటాయింపు వ్యూహానికి జగన్ తెరలేపినట్లయింది.

2019 ఎన్నికల్లో జగన్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. ఇందులో భాగంగా కుల సమీకరణాల్ని బిర్యానీ వండినంత సులువుగా వండి వార్చేశారు. ఉదాహరణకు జనరల్ సీట్లలో బీసీలకు టికెట్లు కేటాయించడం, కుల జనాభాతో సంబంధం లేకుండా గెలుపు సమీకరణాల ఆధారంగా టికెట్లు ఇవ్వడం వంటివి ఇందులో కొన్నిమాత్రమే.

ఇప్పుడు వాటన్నింటినీ పక్కనబెట్టి కులజనాభా ఆధారంగా టికెట్లు కేటాయించే వ్యూహానికి జగన్ తెరలేపినట్లు కనిపిస్తోంది. అలాగే స్ధానికత అస్త్రాన్ని కూడా బయటకు తీస్తున్నారు. తద్వారా స్ధానికులకే అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలనే వాదనను తెరపైకి తెస్తున్నారు.

దీన్నే రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ గా ఆయన ప్రత్యర్ధులు అభివర్ణిస్తున్నారు. అయితే ఇది కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే గ్యారంటీ లేదు. కానీ జగన్ చేస్తున్న ప్రయోగం మాత్రం ప్రత్యర్ధులకు మరోసారి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.