మనకు బాహుబలి సినిమాలు వద్దు.. ఎన్టీఆర్‌లా డైలాగ్ చెప్పలేం.. కార్తీ ఎమోషనల్ స్పీచ్

పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, విక్రమ్, కార్తీ, జయం రవి, ఏఆర్ రెహ్మాన్, శరత్ కుమార్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకలో హీరో కార్తీ ఇంకా మాట్లాడుతూ..

పొన్నియన్ సెల్వన్ లాంటి గొప్ప సినిమా చేసినప్పుడు చాలా విషయాలు గుర్తుకు వస్తున్నాయి. కులం, మతం అనే విషయాలను పక్కనపెట్టినప్పుడు సినిమా ఎంత గొప్పదో అనిపిస్తుంది. మనందరినీ కలిపే సాధనం సినిమా. ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈ వేడుకకు వచ్చిన మీడియా, అభిమానులకు ధన్యవాదాలు అని కార్తీ అన్నారు.

పొనియన్ సెల్వన్ చిత్రం మణిరత్నం 40 ఏళ్ల కల. ఇది బాహుబలి సినిమా మాదిరిగా ఉంటుందా? అని అడుగుతున్నారు. బాహుబలి మనందరం నచ్చిన సినిమా. ఇక మనకు బాహుబలి లాంటి సినిమాలు వద్దు. మనదేశంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఎందరో హీరోలు ఉన్నారు. వాటిని ప్రేక్షకులకు చెప్పాలి అని కార్తీ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో రాజకీయాలు బలంగా ఉన్నాయి. పార్టీలో కుమ్ములాటలు, విభేదాలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ వందేళ్ల క్రితం ఉన్నాయి. ఈ సినిమా కథ మహాభారతం, రామాయణం మాదిరిగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చినందుకు మణిరత్నంకు రుణపడి ఉంటాను. మీ కళను నమ్ముకొండి.. ప్రపంచం మీ వెనుక వస్తుందనే సిద్దాంతాన్ని నమ్ముతున్నాను అని కార్తీ అన్నారు.

సెప్టెంబర్ 30వ తేదీన పొన్నియన్ సెల్వన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సుభాస్కరన్, డిస్టిబ్యూటర్ దిల్ రాజుకు థ్యాంక్స్. తనికెళ్ల భరణి చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో డైలాగ్స్ రాశారు. తెలుగు డైలాగ్స్‌ను కిరణ్ బాగా నేర్పించారు. వీరిద్దరికి నా థ్యాంక్స్.

పొన్నియన్ సెల్వన్ సినిమాలో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకొని చెప్పాం. అలా డైలాగ్స్ చెప్పడం ఈజీకాదు. ఎన్నో చారిత్రాత్మక సినిమాలు ఆయన చేశారు. ఆయన డైలాగ్ డెలివరీ విషయంలో ఎవరూ పోటీపడలేం. అందుకే మేము జాగ్రత్తగా డైలాగ్స్ చెప్పాం అని కార్తీ అన్నారు.