బాలయ్య తుపాకీ పేల్చాల్సింది బాబుపైనే-మీసాలు ఊడిపోతాయ్-మంత్రి జోగి రమేష్ సెటైర్లు

విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ చేసిన ట్వీట్ పై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. మూడు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ ట్వీట్‌ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావు పేరును ఎవరూ చెడగొట్టలేరని, జాతికి, సమాజానికి ఆయనను ఎవరూ దూరం చేయరంటూ బాలకృష్ణ ట్వీట్‌ చేశారని, కానీ నిజానికి ఎన్టీ రామారావును జాతికి, సమాజానికి ఎవరు దూరం చేశారు? మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, ట్రస్టును లాక్కుని, మీ బావ శునకాన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టడం కోసం నీవేం చేశావు బాలకృష్ణ? సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఆ శునకాన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టిందెవ్వరు? అని జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబునాయడు ఒక శునకమని, ఆ శునకానికి తోక ఎవరు? నీవు కాదా బాలకృష్ణా? కుటుంబ విలువలను దిగజార్చి, తుంగలో తొక్కి తండ్రి పెట్టిన పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడిచిన శునకం వెంట నడిచింది నీవు కాదా? అంటే మీరు కాదా శునకాలు? అని జోగి ప్రశ్నించారు. ఆరోజు ఎన్టీ రామారావుగారు తన పిల్లలతో ఏమన్నారు.. మీకు పౌరుషం ఉంటే, మీరు నా కడుపున పుట్టి ఉంటే, నా బిడ్డలే అయితే, నాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడుకు బుద్ధి చెప్పాలి అని అన్నారు. ఆనాడు 73 ఏళ్ల ఎన్టీ రామారావు చివరి కోరిక కోరితే, దాన్ని కూడా తీర్చలేని దద్దమ్మలు మీరంటూ తీవ్ర పదజాలంతో జోగి రమేష్ విమర్శించారు.

మీరు ఈరోజు ఎన్టీ రామారావుగారి మీద ప్రేమ ఉన్నట్లు, ప్రపంచానికి మళ్లీ ఎన్టీ రామారావును తెలియజేస్తున్నట్లు ఎంతలా ప్రవర్తిస్తున్నారు. ఒక శునకాన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ శునకం విసిరిన ఎంగిలి మెతుకులు తిన్నారు. అలాంటి మీరు మాట్లాడతారా? అంటూ బాలయ్యను జోగి ప్రశ్నించారు. అసలు మీకు నైతిక విలువలు ఉన్నాయా? మీరు శునకంలో పోల్చారు. కానీ నిజానికి శునకానికి విశ్వాసం ఎక్కువ. ఇది తెలిస్తే ఆ శునకం కూడా చిన్నబుచ్చుకుంటుందన్నారు. ఆరోజు ఎన్టీ రామారావును పదవి నుంచి కూలదోసినప్పుడు మీరు ఎంత చక్కగా చిరునవ్వుతో ఉన్నారు. ఎంత చిద్విలాసంగా నవ్వారని నిలదీశారు. మీ తండ్రి పీఠాన్ని లాగి, చంద్రబాబు శుకకాన్ని సీఎం పీఠంలో కూర్చోబెట్టిన బాలకృష్ణ, ఏ మాత్రం సిగ్గు లేకుండా ఆరోజు నవ్వుతూ కూర్చున్నాడన్నారు..

మీకు సిగ్గుండాలి అసలు. మిమ్మల్ని, హరికృష్ణను, దగ్గుపాటి వెంకటేశ్వరరావు.. అందరినీ వాడుకుని చెట్టుకు, పుట్టకు ఒకరిని చేశాడు చంద్రబాబునాయుడు అనే శునకమంటూ జోగి రెచ్చిపోయారు. నీ తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబునాయుడు అనే శునకం కొడుక్కి సిగ్గు లేకుండా నీ బిడ్డను ఇచ్చావని,మరి నిన్ను ఏమనాలని నిలదీశారు. శునకం అనాలా? సినిమాల్లో డైలాగ్‌లు చెబుతావు. బయట మాత్రం దద్దమ్మవు అని విమర్మించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి చంద్రబాబునాయుడు శునకం ఏదో నీకు స్క్రిప్ట్‌ రాసిస్తాడు. దాన్ని నీవు ట్వీట్‌ చేస్తావని విమర్శించారు.

14 ఏళ్లు నీ బావ సీఎంగా చేశారు. మీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పని చేశారు. ఏనాడైనా ఎన్టీ రామారావు పేరు చరిత్ర పుటల్లో ఉంచాలన్న ఆలోచన చేశారా? మీరు ఆ శునకం చంద్రబాబు దగ్గర పదవులు తీసుకున్నారు కదా. మరి ఏనాడైనా ఎన్టీ రామారావు పేరును చరిత్రలో నిలపాలన్న ఆలోచన చేశారా? అని జోగి ప్రశ్నించారు. ఎన్టీ రామారావు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చేలా కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని, ఆ విధంగా సగర్వంగా చెప్పుకునేలా తమ నాయకుడు చేశారన్నారు. తమకు ఎన్టీ రామారావుపై నిజంగా అభిమానం ఉందని, అందుకే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయేలా చేశామన్నారు.

మీరు ఎన్టీ రామారావు బిడ్డ కదా? ఆయన రక్తం పంచుకుని పుట్టారు కదా? మరి ఈ ట్వీట్‌ అప్పుడు ఎందుకు చేయలేకపోయావు. జగన్‌గారి పేరు ఉచ్ఛరించడం మీకు ఇష్టం లేకపోతే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, గొప్పదని ఆరోజు ఎందుకు చెప్పలేకపోయావని జోగి ప్రశ్నించారు. బాలకృష్ణా నీకు ఎన్టీ రామారావు జన్మను ఇచ్చాడని, కానీ నీకు పునర్జన్మను ఇచ్చింది మాత్రం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకో. ఇవాళ అదే వైయస్సార్‌ తనయుడు కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టారని, కాబట్టి మీరు రుణపడి ఉండాల్సింది ఇద్దరికీ అన్నారు. ఎన్టీ రామారావు చనిపోయి 26 ఏళ్ల తర్వాత ఇవాళ పెట్టుడు మీసాలతో ఏం మాట్లాడుతున్నారని బాలకృష్ణను జోగి ప్రశ్నించారు. ఎన్టీ రామారావు అందరి గుండెల్లో ఉన్నాడని అంటూ ఆ మీసాలు మెలేస్తూ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెబుతున్నారు. ఎన్టీ రామారావు అందరి గుండెల్లో ఉన్నారంటూ, పెట్టుడు మీసాలు మెలి తిప్పుతున్నారు. ఏం జరుగుతుంది. ఆ మీసాలు ఊడిపోతాయన్నారు.