బతుకమ్మ సంబరాల వేళాయే… పూలపండుగకు తెలంగాణా ముస్తాబయ్యే!!

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి, విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుంది. బతుకమ్మ పండుగను అద్భుతమైన పూల ఉత్సవంగా, ప్రకృతిని పూజించే పండుగగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి, అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు.

ఘనంగా బతుకమ్మ సంబరాలు: సిరిమల్లెలో రామ రఘుమల్లెలో.. బతుకమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత!!ఘనంగా బతుకమ్మ సంబరాలు: సిరిమల్లెలో రామ రఘుమల్లెలో.. బతుకమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత!!

తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పూల పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ సంబరాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చక్కగా ముస్తాబై, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవిని పూజించి, ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ వేడుకలు చేసుకుంటారు.

తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉండే జానపద గీతాలతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. తొలిరోజు అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. ఇక రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లం తోనైవేద్యం అమ్మవారికి పెడతారు.

మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు ఉత్సవాలు జరుపుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీ దేవికి నివేదిస్తారు. నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం ,పాలు కలిపి నైవేద్యం తయారుచేసి గౌరీ దేవికి నివేదిస్తారు. ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలనుపెట్టి పూజిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆరోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. ఆ రోజు ఎవరు ఎటువంటి వేడుకలు జరుపుకోరు.

మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లలా బియ్యంపిండిని చుట్టి, వాటిని బాగా వేయించి, వాటిని నైవేద్యంగాసమర్పిస్తారు. 8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేసి గౌరీ దేవికి నివేదిస్తారు.తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మ ను జరుపుకుంటారు.ఆశ్వయుజ అష్టమి నాడు,అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేసుకుంటారు.

సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం,నువ్వుల అన్నంతయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రక రకాల తృణధాన్యాలనువినియోగిస్తారు. ఇక ఈ నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుంటూ మహిళలు అందరూ సమిష్టిగా వేడుక చేసుకుంటారు.