ప్రొడక్టివిటీ పారనోయా: మైక్రోసాఫ్ట్ సర్వేలో ఏం తేలింది?

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానంలో ఉత్పాదకత గురించి బాసులకు, ఉద్యోగులకు మధ్య వేరు వేరు అభిప్రాయాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ చేసిన కొత్త సర్వే తెలిపింది.

ఆఫీసులో ఉండి పని చేస్తున్నప్పుడు వచ్చినంత ఉత్పాదకత, ఇంటి నుంచి పని విధానంలో పొందగలమా అనే విషయంలో బాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆఫీసులో ఉన్నట్లే, ఇంకా చెప్పాలంటే దాని కంటే ఎక్కువగా తాము ‘ఇంటి నుంచి పని’ విధానంలో పని చేశామని 87 శాతం ఉద్యోగులు చెప్పగా… 80 శాతం మేనేజర్లు దీన్ని ఒప్పుకోలేదు.

11 దేశాల్లో 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను సర్వేలో భాగంగా ప్రశ్నించారు.

వర్క్‌ప్లేస్‌లు ఇక కరోనా ముందు నాటి పరిస్థితికి వచ్చే అవకాశం లేనందున బాసులకు, ఉద్యోగులకు మధ్య తలెత్తుతోన్న ఈ విభేదాలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని బీబీసీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు.

”ఉత్పాదకత రుగ్మత (ప్రొడక్టివిటీ పరానోయా)గా పరిగణిస్తోన్న దాన్ని మనం అధిగమించాలి. ఎందుకంటే మా వద్ద ఉన్న డేటా ప్రకారం 80 శాతం కంటే ఎక్కువ మంది తాము వ్యక్తిగతంగా చాలా ఉత్పాదకంగా పనిచేస్తున్నామని భావిస్తున్నారు. కానీ, వారి మేనేజ్‌మెంట్ మాత్రం వారు ఉత్పాదకంగా లేరని అనుకుంటోంది. అంటే యాజమాన్యం అంచనాలకు, ఉద్యోగులు భావిస్తున్న దానికి మధ్య చాలా అంతరం ఉంది” అని అన్నారు.

పని చేసే విధానంలో వచ్చిన అతిపెద్ద మార్పుతో యజమానులు పోరాడుతున్నారని నాదెళ్ల, లింక్డిన్ బాస్ ర్యాన్ రోస్లాన్‌స్కీ అన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో లింక్డిన్‌లో పూర్తి స్థాయిలో రిమోట్ వర్కింగ్ ఉద్యోగాల అడ్వర్టైజ్‌మెంట్‌ల సంఖ్య చాలా పెరిగిందని ర్యాన్ చెప్పారు. అయితే, ఇలాంటి ఉద్యోగాల సంఖ్య పతాక స్థాయికి చేరుకున్నట్ల డేటా సూచిస్తోందని ఆయన తెలిపారు.

మహమ్మారికి ముందు లింక్డిన్‌లో లిస్ట్ అయి ఉన్న 14 లేదా 15 మిలియన్ల ఉద్యోగాల్లో రిమోట్ వర్కింగ్ ఉద్యోగాలు 2 శాతంగా ఉండేదని ఆయన చెప్పారు. అయితే, కొన్ని నెలల క్రితం వీటి సంఖ్య 20 శాతానికి పెరిగిందని, ఈనెలలో 15 శాతానికి పడిపోయిందని అన్నారు.

ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో సిబ్బందిని నియమించుకోవడంలో, వారిని ఎక్కువ కాలం ఉద్యోగంలో నిలుపుకోవడానికి యజమానులు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని నాదెళ్ల అన్నారు.

”మహమ్మారి సమయంలో మైక్రోసాఫ్ట్‌లో 70 వేల మంది చేరారు. వారంతా ఇంటి నుంచి పని చేస్తూ మైక్రోసాఫ్ట్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు వారికి సోషల్ కనెక్షన్లు ఏర్పడటంలో వారికి మేం సహాయపడాలి” అని అన్నారు.

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగులు తమ సమయంలో 50 శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. దాని కంటే మించి చేయాలనుకుంటే యాజమాన్యం నుంచి అనుమతి పొందాలి.

సెప్టెంబరు నుంచి వారానికి మూడు రోజులు కార్యాలయానికి తిరిగి రావాలని ఆపిల్‌ పిలుపునిచ్చింది. కానీ, దీనికి ఉద్యోగులు ప్రతిఘటిస్తున్నారు.

టెస్లా బాస్ ఎలాన్ మస్క్, వారానికి 40 గంటలు ఆఫీసుకు రావాలని డిమాండ్ చేశారు. “మీరు ఆఫీసులో కనిపించకపోతే, మీరు రాజీనామా చేసినట్లు మేం అనుకోవాల్సి వస్తుంది” అని తన సిబ్బందికి మెయిల్‌లో పేర్కొన్నారు.

మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యోగాలు మారారు. మైక్రోసాఫ్ట్‌లోనూ భారీగా పాత ఉద్యోగులు వెళ్లిపోయి కొత్త ఉద్యోగులు చేరారు. జనరేషన్ జడ్ (1997 తర్వాత జన్మించిన వారు) వారు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగాలు మారే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ సర్వే పేర్కొంది.

2030 నాటికి మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ‘జనరేషన్ జడ్’ సంఖ్య 30 శాతం ఉంటుంది. కాబట్టి నిర్వాహకులు వారిని అర్థం చేసుకోవాలని లింక్డిన్ బాస్ అన్నారు.

బాసులకు, ఉద్యోగులకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మైక్రోసాఫ్ట్, ‘వైవా’ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది.

ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, తమ బాసులతో నేరుగా సంప్రదింపులు జరపడానికి, ఆన్‌లైన్ టీచింగ్ వంటి వాటికి ఉపయోగపడుతుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)