ప్రైవేట్ ఆస్పత్రులను టార్గెట్ చేసిన తెలంగాణా సర్కార్.. వరుస దాడులతో హడల్!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తున్నారు వైద్య శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ లలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్న అధికారులు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తున్నారు .

కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళల మృతి ఘటన: తెలంగాణా సర్కార్ సీరియస్; చర్యలు షురూ!!కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళల మృతి ఘటన: తెలంగాణా సర్కార్ సీరియస్; చర్యలు షురూ!!

అనుమతులు లేకుండా ఆసుపత్రులను నిర్వహించడంతోపాటు, అర్హత లేకుండా చికిత్స నిర్వహిస్తున్న వైద్యులను గుర్తించటం పై దృష్టిసారించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా వైద్య శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీలలో అనేక ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన విస్తృత తనిఖీలలో ఎనిమిది ఆసుపత్రులను, పలు క్లినిక్ లను సీజ్ చేశారు. మరో 30కి పైగా ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాలాపూర్, మన్సురాబాద్, కర్మన్ ఘాట్, శేరి లింగంపల్లి, శంషాబాద్, చేవెళ్ల, కొత్తపేట, వనస్థలిపురం, అమీర్ పేట, హస్తినాపురం, బి.యన్.రెడ్డి, నార్సింగిలలో నిర్వహించిన తనిఖీలలో ప్రైవేట్ ఆసుపత్రిలో అనేక లోపాలను గుర్తించారు.

ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా నూ ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు చేశారు జిల్లా అధికార యంత్రాంగం. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు నేతృత్వంలో కాకాజీ కాలనీ లో గల 4 ఆస్పత్రులను తనిఖీ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2010 ననుసరించి నియమ నిబంధనలకు అనుగుణంగాధరల పట్టిక, అనుమతి పత్రాలను, ప్రదర్శించనందున మూడు ఆసుపత్రులకు మరియు ఒక డెంటల్ ఆసుపత్రికిరిజిస్ట్రేషన్ లేనందువలన నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండాకొత్తగా ఈ చట్టం ప్రకారంఆయుర్వేద , హోమియో , యునాని, నేచరోపతి క్లినిక్ లు, ఆసుపత్రు లు మొదలగునవి విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ తనిఖీల యొక్క నివేదికను ప్రతిరోజు హెల్త్ డైరెక్టర్ కు నివేదిస్తామని ఆయన తెలిపారు.

నల్గొండ జిల్లాలోనూ ఆసుపత్రులలో తనిఖీలు చేసిన వైద్యాధికారులు నల్గొండ జిల్లాలో ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగిత్యాలలో 2 ప్రైవేటు ఆసుపత్రులకు, ఆదిలాబాద్ జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రులకు, ములుగు జిల్లాలో మూడు ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదు ల్యాబ్ లను , ఒక ప్రైవేటు ఆసుపత్రి ని సీజ్ చేసిన అధికారులు నియమ నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఇక ఈ డ్రైవ్ అన్ని జిల్లాల్లోనూ కొనసాగుతుందని వైద్యశాఖ తేల్చిచెప్పింది. నియమ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించింది.