పులివెందులలో పోటీచేయడం గొప్పా? కుప్పంలో పోటీచేయడం గొప్పా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్లర్ ను మించిపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అభివర్ణించారు. సీఎం పర్యటన అంటేనే ప్రజలు హడలిపోతున్నారని, ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకు ప్రజల్ని తరలించేందుకు వాడుతున్నారన్నారు. జనం తిరగబడతారనే భయంతోనే ఎక్కడికి వెళ్లినా డబుల్ బారికేడ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల తిరుగుబాటు ప్రారంభమైదని, వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. మీడియాతో మాట్లాడిన నరేంద్ర జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజలు దొంగల్ని, బందిపోటు దొంగల్ని చూసి భయపడేవారని, ఏపీలో మాత్రం సీఎం పర్యటన అంటేనే భయపడుతున్నారన్నారు. దుకాణాలు, పాఠశాలల్ని బలవంతంగా మూయిస్తారని, పాఠశాల బస్సులను బలవంతంగా లాక్కొని ప్రజలను తరలించడానికి వాడుతున్నారన్నారు. పర్యటనకు రాకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నరని, ప్రజల్లోకి రావడానికి జగన్ భయపడుతున్నంట్లుందన్నారు.

నీ బలం, బలగం ఉన్న పులివెందులలో పోటీచేయడం గొప్పా? సామాజికవర్గం లేదు.. బలగం లేదు.. బంధువులు లేరు.. పరివారం లేని కుప్పంలో పోటీచేయడం గొప్పా? అని ప్రశ్నించారు. బీసీల సీటని జగన్ చెబుతున్నారని, జిల్లాలో మంత్రి పదవులు ఇద్దరికీ రెడ్లకే ఎందుకిచ్చారని ప్రశ్నించారు. బీసీలు అప్పుడు కనపడలేదా? కుప్పం వచ్చి బీసీ జపం చేస్తే ప్రజలు నమ్ముతారా? అని నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.