నిలబడటం లేదు -అర్హుడినో అనర్హుడినో: ఎన్టీఆర్ పరిచయంతో – జస్టిస్ ఎన్వీ రమణ..!!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత జస్టిస్ ఎన్వీ రమణ తొలి సారి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు న్యాయ ప్రముఖులతో పాటుగా ఇతర రంగాల ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ కేంద్రంగా రసమయి సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో రసమయి సంస్థ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించింది.

తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్ రావు ఈ పురస్కారం ప్రధానం చేసారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలన్న తన ఆకాంక్ష నెరవేరలేదని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రజల్లో కోర్టులపై ఉన్న భయాలు, ఆందోళనలు తొలగించేందుకు న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం కోసం 16 నెలలు తన వంతుగా కృషి చేసినట్లు చెప్పారు. అక్కినేనితో ఉన్న తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఎక్కువ సినిమాలు చూడలేకపోయినప్పటికీ ఇప్పటికీ పాత సినిమా వీడియోలు చూస్తూ ఉంటానని తెలిపారు.

విభిన్న భాషా చిత్రాల్లో నటించిన నాగేశ్వరరావు దేశ సమైక్యతను చాటిచెప్పిన గొప్ప జాతీయవాది అని జస్టిస్ ఎన్వీ రమణ కీర్తించారు. సినిమా రంగం గురించి ఎక్కువ విమర్శ చేయడం కాదు గానీ.. నాటి పాత సినిమాలు నిలబడినట్టుగా కొత్త సినిమాలు నిలబడటంలేదని… దీనికి కారణమేంటో సినీ రంగంలో ప్రముఖులే ఆలోచించాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తాను న్యాయమూర్తి కాకముందు తనకు అక్కినేనితో మంచి పరిచయాలు ఉన్నాయని..ఎన్నో వేదికలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్‌తో ఉన్న పరిచయం వల్ల సినీ రంగంపై అవగాహన ఉండేదని చెప్పారు. తాను సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అక్కినేని పురస్కారం అందుకోవటానికి వచ్చానని.. ఈ పురస్కారానికి నేను అర్హుడినో అనర్హుడినో గానీ ఈ అవార్డు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. పొరుగు భాషా కవులకున్న ఆదరణ తెలుగు కవులకు లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు న్యాయస్థానాలంటే భయపడే స్థితి గతంలో ఉండేదని, ఇప్పుడు సమస్య వస్తే ధైర్యంగా కోర్టును ఆశ్రయిస్తున్నారని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.