దిగ్గీరాజా బ్యాక్ స్టెప్: ఏఐసీసీ చీఫ్ పోస్ట్‌కు పోటీ చేయడం లేదట, ఇక బరిలో వారిద్దరే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ కోసం గెహ్లట్, థరూర్ మధ్యే పోటీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెరపైకి దిగ్విజయ్ సింగ్ పేరు కూడా వచ్చింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆయన పోటీలో లేనని స్పష్టంచేశారు. దీంతో వారిద్దరి మధ్యే పోటీ ఉండనుంది. గెహ్లట్ గెలుపు ఖాయం అనే మాటలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ చీఫ్ పోస్ట్‌కు పోటీ చేయబోతున్నారనే ప్రచారాలకు దిగ్విజయ్ సింగ్ తెర దించారు. బరిలో లేనని తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్ పూర్‌లో మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ ఇచ్చే సూచనలను పాటిస్తానని దిగ్గీ రాజా చెప్పారు. దీంతో పార్టీ టాప్ పోస్ట్‌కు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మాత్రమే పోటీ చేస్తున్నారని స్పష్టమయింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై..ఈ నెల 30తేదీతో ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ఆ తర్వాత బరిలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే.. అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు.

అధ్యక్ష పదవీ ఎన్నికలో పోటీ చేయడం లేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని ఇవాళ కూడా ప్రకటన చేశారు. దీంతో గెహ్లట్, థరూర్ బరిలో ఉన్నారు.