దమ్ముంటే రండి..తేల్చుకుందాం: ఆ బీజేపీ నేతలకు మంత్రి జగదీశ్ రెడ్డి వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక మునుగోడులో అయితే యుద్ధం పీక్స్ కు చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో చోటు చేసుకుంది.

చౌటుప్పల్ లో సహకార సంఘ కార్యాలయం వద్ద నిర్మించనున్న గోదాంకు శంకుస్థాపన చేయడానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిసిసిబి చైర్మన్ మాట్లాడుతూ కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అంతటితో ఆగక కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీకి చెందిన పిఎసిఎస్ డైరెక్టర్లు మంత్రి జగదీష్ రెడ్డి తో వాదనకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయడం అవసరం లేదంటూ మండిపడ్డారు.

దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ మంత్రి, నేతల తీరును తప్పుపట్టిన బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, చోటుచేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి జగదీష్ రెడ్డి మైక్ తీసుకుని బిజెపి డైరెక్టర్ల పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సహకార సంఘానికి శుభాకాంక్షలు చెప్పి ప్రశాంతంగా శంకుస్థాపన కార్యక్రమానికి చేసి వెళదామని వస్తే బిజెపి కి సంబంధించిన నాయకులు ప్రశాంతంగా జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని మండిపడ్డారు.

రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గురించి చెబితే తప్పు ఏంటో చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రైతులను నిలువునా ముంచారు అని, రైతాంగాన్ని మోసం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ కార్యక్రమం జరిగినా అడ్డుకోవడం కాదు.. మీకు దమ్ముంటే రండి.. చూసుకుందాం అంటూ మంత్రి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికక్కడ కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ మంత్రులు, నేతలు.. అడ్డుకుంటూ బీజేపీ నేతల ప్రయత్నాలతో తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది.