టీడీపీలో

విజ‌య‌వాడ కేంద్రంగా ఉన్న నంద‌మూరి తార‌క‌రామారావు (ఎన్టీఆర్‌) ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యానికి ఆయ‌న పేరు తొల‌గించి డాక్ట‌ర్ ఎడుగూరి సందింటి రాజ‌శేఖ‌ర్ రెడ్డి(వైఎస్సార్‌) పేరును ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం పెట్టింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో అల‌జ‌డి రేకెత్తింది. తెలుగుదేశం పార్టీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో పాటు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పేరు మారుస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఈ పేరు మార్చ‌డంవ‌ల్ల అధికార వైసీపీకి ఏమైనా ప్ర‌యోజ‌న‌ముందా? లేదంటే తెలుగుదేశం పార్టీకి ఏమైనా న‌ష్టం వాటిల్లిందా? అంటే రెండూ లేవంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

త‌న సోద‌రుడు తీసుకున్న నిర్ణ‌యాన్ని వైటీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఖండించారు. ఒక‌రి గౌర‌వాన్ని తీసుకొని మ‌రొక‌రికి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రేపు ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత వైఎస్ పేరు మారిస్తే త‌న తండ్రికి అవ‌మాన‌క‌రంగా ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో టీడీపీ శ్రేణులు ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ అనుకున్నంత‌స్థాయిలో మాట్లాడ‌లేక‌పోయార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న ఉన్న ప‌రిస్థితుల్లో స్పంద‌న స‌రిగానే ఉంద‌నుకున్నా టీడీపీ ప‌రిస్థితుల‌కు అత‌క‌లేదు.

వైసీపీలో ఉన్ననేత‌ల‌కే పేరు మార్పు నిర్ణ‌యం రుచించ‌లేద‌ని, అధినేత తీసుకున్న నిర్ణ‌యం కాబ‌ట్టి మౌనం వ‌హించారంటున్నారు. యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ ఒక్క‌రే అధికార భాషా సంఘం అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా చెప్పుకునే కొడాలి నాని, ల‌క్ష్మీపార్వ‌తిలాంటివారు ఇంత‌వ‌ర‌కు మీడియా ముందుకు రాలేదు. వారికి ఏం చెప్పాలో తెలియ‌ని ప‌రిస్థితి ఎదురైందంటున్నారు. వైఎస్‌ను అభిమానించేవారికి కూడా పేరు మార్పు నిర్ణ‌యం నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ చేసిన స‌మ‌ర్థ‌న, బ‌య‌ట వైసీపీ నేత‌లు చేస్తున్న వాద‌న‌లు తేలిపోతున్నట్లవుతున్నాయి.

పురందేశ్వ‌రి, ప‌వ‌న్‌కల్యాణ్ మాత్ర‌మే ప్రభుత్వానికి గ‌ట్టిగా కౌంట‌ర్లు ఇవ్వగలిగారు. ఏదేమైనప్పటికీ రాజకీయాలకు సంబంధించి పేరు మార్పు విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు వరకు ఉన్నవన్నీ ఈ వ్యవహారం ధాటికి మరుగునపడ్డాయి. ఎన్నిరోజులు ఈ పేరు మార్పు వివాదం నడుస్తుందో అర్థం కావడంలేదంటున్నారు. రెండు పార్టీల్లో అలజడి రేకెత్తడానికి కారణమైన ఈ నిర్ణయంవల్ల వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందా? టీడీపీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందా? అనేది కొద్దిరోజులు గడిస్తేకానీ చెప్పలేని పరిస్థితి.