జాతీయస్థాయిలో సిద్ధమవుతున్న మహాకూటమి?

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించడంపైనే అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సీబీఐ, ఈడీలను ఉపయోగించి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు కూలదోస్తున్నారనేది ఈ పార్టీల ప్రధాన ఆరోపణ. వరుసగా విజయం సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీయేకి ఈసారి అధికార పీఠం దక్కకుండా ఉండేందుకు నిష్ణాతులైన నేతలంతా వ్యూహరచన చేస్తున్నారు.

అయితే పిల్లి మెడలో గంట కట్టేవారెవరు? అన్న తీరులో వీందరినీ ఒకే వేదికమీదకు తీసుకురావడం కత్తిమీద సాములా మారింది. ఏ పార్టీకి ఆ పార్టీ నేత ఇతరులతో కలవడానికి మొగ్గు చూపించకపోవడం, కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర వద్దనడం లాంటివన్నీ జరుగుతున్నాయి. తాజాగా జాతీయస్థాయిలో ఒక కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్ జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ సిద్ధమయ్యారు. దీంతో జాతీయ స్థాయిలో మహాకూటమికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

నితీష్ కుమార్ తో కలిసి ఢిల్లీలో సోనియాతో సమావేశమబోతున్నట్లు లాలూ ప్రకటించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతామని, 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దూరం చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రజాసమస్యలను పక్కన పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేవా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ నేతలు సోనియాతో భేటీకి సిద్ధమవడం విశేషం.

2015 బీహార్ ఎన్నికల సమయంలో చివరిసారిగా లాలూ, నితీష్ ఒక ఇఫ్తార్ విందులో సోనియాను కలిశారు. గత నెలలో నితీష్ కుమార్ రాహుల్ ను కలిసినప్పటికీ ఆ సమయంలో సోనియా విదేశీ పర్యటనలో ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం ఆయన సింగపూర్ వెళ్లనున్నారు. సోనియాను మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ మహాకూటమిపై చర్చించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.