జపాన్: షింజో అబే అంత్యక్రియల ఖర్చు బ్రిటన్ రాణికైన ఖర్చుకన్నా ఎక్కువా, ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు

“బ్రిటన్ రాణి అంత్యక్రియల ఖర్చు కంటే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ఖర్చు ఎందుకు ఎక్కువవుతోంది” అంటూ ఒక వార్తా శీర్షిక కనిపించింది.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే జులై 7న హత్యకు గురయ్యారు. నారాలో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన పై జరిగిన కాల్పులు జరిగాయి. ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు 27న జరగనున్నాయి. షింజో అబే వయసు 67 ఏళ్లు. సుదీర్ఘకాలం జపాన్ ప్రధానిగా ఉన్న అబే జపాన్‌లో అరుదైన, దిగ్బ్రాంతి కలిగించే ఘటనలో మరణించారు.

అయితే, ఈయన అంత్యక్రియలకయ్యే ఖర్చు జపాన్‌లో చర్చనీయాంశంగా మారింది.

జపాన్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న ప్రధానుల్లో అబే రెండవ వ్యక్తి.

55 ఏళ్ల క్రితం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ కు నాయకుడిగా వ్యవహరించిన షిగేరు యోషిదా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. ఆయనను యుద్ధం తర్వాత జపాన్‌కు దిశానిర్దేశం చేసిన నాయకుడిగా చెబుతారు.

షింజో అబే అంత్యక్రియలకయ్యే ఖర్చును బ్రిటన్ రాణి అంత్యక్రియలకైన ఖర్చుతో పోల్చి చూస్తున్నారు.

బ్రిటన్ రాణి అంత్యక్రియలకైన ఖర్చు గురించి బహిరంగంగా వెల్లడి చేయనప్పటికీ డైలీ మిర్రర్ పత్రిక మాత్రం ఈ ఖర్చును సుమారు 8 మిలియన్ పౌండ్లగా (సుమారు రూ. 70.56 కోట్లు) అంచనా వేసింది.

ఈ ఖర్చుతో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ఖర్చు పెట్టే 1.66 బిలియన్ యెన్ (సుమారు రూ.94 కోట్లు)తో పోల్చింది.

ఈ అంత్యక్రియలకు అంచనా వేసిన ఖర్చు కంటే ఎక్కువే కావచ్చని చాలా మంది భావిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు కూడా ముందుగా అంచనా వేసిన ఖర్చు కంటే రెట్టింపు ఖర్చు13 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.05లక్షల కోట్లు) ఖర్చయినట్లు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

జపాన్‌లో సాధారణంగా భారీ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు సంబంధిత ఖర్చు భారం మధ్యవర్తులుగా వ్యవహరించే సంస్థల పై పడుతూ ఉంటుంది. బ్రిటన్ పెట్టే ఖర్చుకు, జపాన్ పెట్టే ఖర్చుకు మధ్య ఇదే తేడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అబేకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు టోక్యోకు చెందిన మురాయామా అనే ఈవెంట్ సంస్థకు 176 మిలియన్ యెన్ (సుమారు రూ. 10 కోట్లు)విలువైన కాంట్రాక్ట్ దక్కింది. అయితే, ఈ సంస్థకు కాంట్రాక్టు దొరకడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అబే ప్రతీ ఏటా ఏర్పాటు చేసే చెరీ బ్లాసమ్ పార్టీని ఈ సంస్థ నిర్వహించేది. ఈ విషయంలో ఆయన బంధు ప్రీతి, సన్నిహిత వర్గాలకు మేలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

క్యోడో వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే లో 75 శాతం మందికి పైగా ఈ అంత్యక్రియలకు ప్రభుత్వం అవసరానికి మించి ఖర్చు పెడుతోందని చెప్పారు.

సగం డబ్బులు అంత్యక్రియల సమయంలో చేసే భద్రతా ఏర్పాట్ల కోసం వెచ్చించాల్సి ఉండగా, మరో మూడొంతులు విదేశీ అతిధులకు ఆతిధ్యం ఇచ్చేందుకు ఖర్చు పెడుతున్నారు.

అబే అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ప్రస్తుత ప్రధాని పుమియో కిషిదాను కలిసేందుకు విదేశాల నుంచి అతిధులు జపాన్ వస్తున్నారు. ఈ మూడు రోజుల అంత్యక్రియల కార్యక్రమాన్ని “అంత్యక్రియల రాయబారం” అని కూడా వర్ణిస్తున్నారు.

ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 217 దేశాల నుంచి సుమారు 700 మంది అతిధులు వస్తున్నారు. వీరిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, భారత ప్రధాని మోదీ. ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్ కూడా ఉన్నారు.

లండన్‌లో జరిగిన బ్రిటన్ రాణి అంత్యక్రియలకు పదవిలో ఉన్న ప్రపంచ నాయకులు హాజరైతే, అబే అంత్యక్రియలకు మాత్రం చాలా వరకు మాజీ నాయకులు హాజరవుతున్నారని జపాన్ లో పలువురు అంటున్నారు.

జపాన్లో రాణి అంత్యక్రియలకు ఇచ్చిన టీవీ కవరేజీని చూస్తే, జపాన్ ప్రజలకు రాచరికం పట్ల ఉన్న ప్రేమ, భావోద్వేగాలు అర్ధమవుతాయి.

అబే అంత్యక్రియలకు అవుతున్న ఖర్చు పట్ల ఆగ్రహం ప్రదర్శిస్తూ కొన్ని స్థానిక మీడియా సంస్థలు 1967లో యోషిదా అంత్యక్రియలకు వెచ్చించిన 18 మిలియన్ యెన్ (రూ. ఒక కోటి) ఖర్చును ప్రస్తావించాయి. ఇది ప్రస్తుతం 70 మిలియన్ యెన్ (సుమారు 4కోట్లు)తో సమానం.

జపాన్ గత దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ డబ్బును అల్పాదాయ వర్గాల వారి కోసం ఖర్చు పెట్టొచ్చని విమర్శకులు అంటున్నారు.

అబేకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం పట్ల ఎదురవుతున్న వ్యతిరేకత, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజల ఆదరణ తగ్గేలా చేస్తున్నాయని కొందరు అనుమానిస్తున్నారు.

కిషిదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వానికి అత్యంత తక్కువ ఆదరణ లభిస్తున్న సమయం ఇది.

ప్రధానిగా అబే అమలు చేసిన విధానాలు జపాన్‌ను విభజించాయన్న ఆరోపణలు ఉన్నాయి. జపాన్ ప్రజల్లో ఆయన పాలన కాలం పట్ల నెలకొన్న వ్యతిరేకత రూపుమాపయ్యే సంకేతాలేవీ కనిపించడం లేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)