జగన్ కు కాదు టీడీపీ నేతలకే ప్రివిలేజ్ నోటీసులివ్వాలి-బుగ్గన ఫైర్-కాగ్ తప్పుబట్టింది టీడీపీనే..

ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు ఆర్ధిక మంత్రి బుగ్గన ఇవాళ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ అసెంబ్లీలో వాస్తవాలను పూస గుచ్చినట్లు వివరించారని, గత టీడీపీ పాలనలో జరిగిందేమిటో, గత మూడున్నర ఏళ్ల కాలంలో తన పరిపాలనలో ఆర్థిక నిర్వహణ ఎలా జరిగిందో, జరుగుతున్నదో రాష్ట్ర ప్రజలందరికీ వివరించారన్నారు. కాగ్‌ తన నివేదికలో 2020-21 సంవత్సరపు ఆర్థిక పరిస్థితిపైనా, అంతకు ముందు 2015-16 నుంచి 2020-21 సంబంధించిన ఆర్థిక అంశాల్ని ప్రస్తావించిందన్నారు.

కాగ్‌ నివేదికలోని అంశాల్లో తొలి నాలుగేళ్ల టీడీపీ పాలనలోని ఆర్థిక వ్యవహారాలపైనే అనే విషయం గ్రహించాలని ఆర్ధికమంత్రి బుగ్గన తెలిపారు. ఈ నివేదికలో టీడీపీ పాలనలో ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు ఉన్నాయన్నారు. టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా రూ. 17,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టిందన్నారు. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను ఒక కారణంగా చూపి, ఇపుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించింది. ఎఫ్‌ఆర్‌బీఎంను ఉల్లంఘించి అప్పులు ఎక్కువగా ఎవరు చేశారనేది ప్రజలు గ్రహించ లేదనుకుంటున్నారా అని బుగ్గన ప్రశ్నించారు.

కాగ్‌ నివేదికలో పొందు పర్చిన ప్రత్యేక బిల్లుల అంశం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదేనని బుగ్గన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ ప్రభావం ఎంతగా ఉందో ప్రజలకు తెలుసన్నారు. ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశం లావాదేవీల సర్దుబాట్లకు సంబంధించిన అంశమేనన్నారు. ప్రత్యేక బిల్లులపై ఆర్థిక మంత్రి హోదాలో తాను గతంలోనే సవివరమైన సమాధానం చెప్పానని బుగ్గన తెలిపారు. సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను గుర్తించడం కోసం మాత్రమే ప్రత్యేక బిల్లులు అని పేరు పెట్టామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగవని టీడీపీ నేత యనమలకు కూడా బాగా తెలుసన్నారు. కానీ ఆయన మాత్రం దురుద్దేశ్యంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వారిని గందరగోళ పరిచేందుకు లేని పోని అభాండాలు వేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2018-19లో ఇదే విధంగా 98,049 బుక్‌ అడ్జస్ట్‌మెంట్స్‌ ట్రాన్సాక్షన్లను ప్రత్యేక బిల్లులుగా చూపింది మర్చిపోయారా? అపుడు ఆర్థిక మంత్రి మీరే కదా అని యనమలను నిలదీశారు.

యనమల చెప్తున్న రూ 26,839 కోట్ల ప్రత్యేక బిల్లులు నగదు లావాదేవీలు కావని, అవి కేవలం బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ మాత్రమేనని బుగ్గన క్లారిటీ ఇచ్చారు. ఈ లావాదేవీల సర్దుబాట్లకు కారణం సీఎఫ్‌ఎంఎస్‌లో సెంట్రలైజ్‌డ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌ లేక పోవడమేనన్నారు. ఇదే విషయం తాను అనేక సార్లు చెప్పినా యనమల మాత్రం మళ్లీ మళ్లీ చెప్పిన అబద్ధాలే చెప్పి ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారన్నారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అదే నిజమై పోతుందని ఆయన భ్రమ పడుతున్నారన్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనే లేదన్నారు. కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే అభ్యంతరం లేవనెత్తారన్నారు. ఈ సమస్యలన్నీ కూడా సీఎఫ్‌ఎంస్‌ వ్యవస్థను పటిష్టంగా రూపొందించక పోవడం వల్లనే తలెత్తాయని బుగ్గన తెలిపారు. ఈ ప్రత్యేక బిల్లుల ప్రక్రియ సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో ఉత్పన్నమైన ప్రాథమిక లోపాల వల్లనే 2020-21లో వినియోగించడం జరిగిందన్నారు. దానిని సరిదిద్ది గత 9 నెలలుగా కాగ్‌ సలహాల మేరకు స్పెషల్‌ బిల్లుల విధానం అనేది లేకుండా ‘నిల్‌ అడ్జస్ట్‌మెంట్‌ బిల్లుల’ పద్ధతిలో జమాఖర్చుల నిర్వహణ జరుగుతోందని వివరణ ఇచ్చారు.యనమల చెబుతున్నట్లు ఇందులో ఎక్కడా ట్రెజరీ కోడ్‌ ఉల్లంఘన జరుగలేదని, కాగ్‌ తన నివేదికలో కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే అభ్యంతరం లేవనెత్తిందన్నారు