చంద్రబాబు అలా.. నేను ఇలా.: కాంగ్రెస్‌లోకి కోడలిలా అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికరం

నల్గొండ: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపూర్, కోతులపురం, అల్లందేవిచెరువు, సర్వేల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు రేవంత్. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

తాను జైలులో తిన్నచిప్పకూడు సాక్షిగా…తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పేదల కోసం ఒక్కసారి కాదు వంద సార్లు జైలుకు వెళ్లడానికి సిద్దమని ప్రకటించారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని బీజేపీ, టీఆర్ఎస్ గోతి కాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయని రేవంత్ విమర్శించారు.

దేశంలో కాంగ్రెస్‌పై బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. తనను అడ్డు తొలగించుకోడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను దొంగతనం చేసి జైలుకు పోలేదు. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లా.. మునుగోడుతో తమకు ఎంతో అనుబంధం ఉంది. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్… ఎన్నికల కోసం వాళ్ల కాళ్లు పట్టుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు పట్టాలిస్తే కేసీఆర్ ఈ భూముల్ని గుంజుకుంటున్నడని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచినందుకు?.. చంటిపిల్లల పాలపై జీఎస్టీ వేసినందుకు బీజేపీ వాళ్లకు ఓటేయాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన తమకే మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందన్నారు. పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్ననమ్మకము తనకుందన్నారు.

ఒకప్పుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌లో ఉన్నాడని.. ఆయన టీడీపీలోకి కోడలి లాగా వచ్చాడని… తాను టీడీపీ బిడ్డనని… అక్కడ నుంచి కాంగ్రెస్‌లోకి కోడలి లాగా వచ్చానని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టిల్లు అయిన తెలుగు దేశం నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. అయితే, చంద్రబాబునాయుడే తనను కాంగ్రెస్‌లోకి పంపించాడని అర్థం వచ్చేట్లు వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీలోకి కోడలు లాగా వచ్చిన తాను…ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గౌరవం నిలబెడతానని రేవంత్ చెప్పారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నాని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని పునరుద్ఘాటించారు.