చంద్రబాబును ఫిక్స్ చేసిన రేవంత్..!! వైసీపీ – బీజేపీ చేతికి కొత్త అస్త్రం..!!

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తెలంగాణకే పరిమితం కాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పైన ప్రభావం చూపే విధంగా మారాయి. తాను కాంగ్రెస్‌ పార్టీలోకి కోడలిలా వచ్చానన్న రేవంత్‌ రెడ్డి…ఈ పార్టీ కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. తాను జైలులో తిన్నచిప్పకూడు సాక్షిగా…రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని మునుగోడు ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు.

పుట్టిల్లు అయిన తెలుగు దేశం నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. దీనికి కొనసాగింపుగా.. చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.

ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మనిషని..ఆయన అప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే – మంత్రిగా పని చేసారని రేవంత్ గుర్తు చేసారు. ఆయన అటు వైపు వెళ్లారు..తనకు కాంగ్రెస్ లోకి పంపారని చెబుతూ..తప్పేంటని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. టీడీపీ అధినేత రాష్ట్ర విభజన తరువాత ఏపీ సీఎంగా ఉన్నారు.

ఆ సమయంలో అమరావతికి వచ్చిన రేవంత్ ఎమ్మెల్యేతో పాటుగా పార్టీ పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. అయితే, 2019 ఎన్నికల వేళ.. ప్రధాని మోదీతో విభేదించిన చంద్రబాబు నాడు కాంగ్రెస్ తో జత కలిసారు. మోదీ ఓటమి ఖాయమని నాడు ప్రచారం చేసారు. ప్రధాని మోదీకి వ్యతిరేక పార్టీల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో రాహుల్ ఇంటికి వెళ్లారు. కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ, ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి.

అటు కేంద్రంలో మోదీ..ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత టీడీపీ సీనియర్లే చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలపటాన్ని చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ అధినేత వెళ్లి..కాంగ్రెస్ అధినాయకత్వం వద్దకు వెళ్లటం పార్టీ నేతలు జీర్ణించుకోలేదు. ఇక, రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో పాటుగా బీజేపీ మద్దతు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. బీజేపీ నేరుగా ఎన్నికల్లో తనతో పొత్తుకు ముందుకు రాకపోయినా, జగన్ కు మాత్రం మద్దతుగా నిలవకుంటే చాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం నెమ్మదిగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడా జాతీయ రాజకీయాలు.. కాంగ్రెస్ మద్దతు అంశాల్లో జోక్యం చేసుకోవటం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు.

అయితే, ఇప్పుడు రేవంత్ తనను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపారంటూ చేసిన వ్యాఖ్యలు బిగ్ డిబేట్ గా మారుతున్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లోనూ చంద్రబాబు దూరం పాటిస్తున్నారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ తో చంద్రబాబుకు ఉన్న సంబంధాల పైన చర్చ జరిగే విధంగా ఈ వ్యాఖ్యలు కారణమవుతున్నాయి.

కొంత కాలంగా రేవంత్ ను చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపారు..పీసీసీ చీఫ్ అయ్యేందుకు సహకరించారనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలను చంద్రబాబు అండ్ కో పైన అటు వైసీపీ..ఇప్పుడు బీజేపీ తమకు అనుకూల అస్త్రాలుగా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేతలతో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వేళ..ఈ వ్యాఖ్యలు ప్రభావితం చేయటం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.