కొడాలి నాని, వల్లభనేని వంశీ… వ్యూహాత్మక మౌనం!

కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌స్తుతం వైఎస్సార్ కాంగ్ర‌స్ పార్టీలో ఉన్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించి అధికారంలో ఉన్న వైసీపీకి అనుబంధ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. కొడాలి నాని ఎన్టీఆర్‌కు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్ర‌బాబు విధానాలు న‌చ్చ‌క తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ అభిమానిగానే కొడాలికి రాష్ట్ర‌వ్యాప్తంగా పేరుంది. ఇప్పుడు ఈ ఇద్ద‌రు నేత‌లు సంక‌ట‌స్థితిలో ప‌డ్డారు.

వైసీపీ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం పేరును డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంగా మార్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన వైఎస్ పేరు ఉండ‌ట‌మే స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న త‌న‌యుడు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. రెండు ద‌శాబ్దాల పైబ‌డి ఉన్న పేరు మార్చ‌డంవ‌ల్ల రాజ‌కీయంగా క‌ల‌క‌ల‌కం రేకెత్తుంద‌ని తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సాహ‌సానికి ఒడిగ‌ట్టారు. దీనిపై సొంత పార్టీలోనే నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ల‌క్ష్మీపార్వ‌తి ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే అంద‌రి దృష్టి కొడాలి నాని, వంశీల‌పైనే ఉంది. ఈ మొత్తం అంశంలో తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ది వీరిద్ద‌రే కావ‌డం గ‌మ‌నార్హం.

వంశీ జ‌గ‌న్‌కు లేఖ రాశారు. పేరు మార్పు అంశాన్ని పున‌రాలోచించుకోవాల‌ని కోరారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఈ విష‌యం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా మారుతుంద‌ని ఆయ‌న గ్ర‌హించారు. వెంట‌నే స్పందించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన‌ప్ప‌టికీ యూనివ‌ర్సిటీ పేరు మాత్రం మార్చ‌డం త‌గ‌న్నారు. త‌న‌వ‌ర‌కు తాను మాట్లాడాన‌నుకున్నారు. ఆయ‌న విష‌యం అంత‌టితో ముగిసిపోయింది.

కొడాలి నాని ఇంత‌వ‌ర‌కు దీనిపై స్పందించ‌లేదు. ఆయ‌న స్పందించాలంటూ అన్నివ‌ర్గాల నుంచి ఒత్తిళ్లు వ‌స్తున్నాయి. కానీ త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర మాత్రం ఆయ‌న వాపోతున్న‌ట్లు తెలిసింది. ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో, సామాజిక‌వ‌ర్గంలో ఏం చెప్ప‌లేక‌పోతున్నాన‌ని, ఏమీ పాలుపోవ‌డంలేద‌ని వ్యాఖ్యానించిన‌ట్లుగా తెలుస్తోంది. అన్నివైపుల నుంచి తనపై విమర్శలు వస్తున్నాయని, తన నియోజకవర్గంలో అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందంటున్నారు. పేరు మార్పునకు సంబంధించి టీడీపీతోపాటు జనసేన, బీజేపీ, పురందేశ్వరి, వామపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే టీడీపీపై, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే కొడాలి నాని, వల్లభనేని వంశీ మౌనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.