కొడాలి నాని ఇలాకాలో అమరావతి రైతులు : రూట్ మ్యాప్ వెనుక లెక్క పక్కా..!!

అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభంలో ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఈ పాదయాత్ర ప్రారంభమైన వేళ..వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ యాత్రను ఉత్తరాంధ్ర పైన దండయాత్రగా పేర్కొన్నారు. అసెంబ్లీలోనూ పరిపాలనా వికేంద్రీకరణ పైన చర్చ సాగింది. సీఎం జగన్ తనకు అమరావతి పైన కోపం లేదని, అమరావతితో పాటు మరో రెండు రాజధానులు ఉండాలని కోరుకుంటున్నట్లుగా వివరించారు. రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నెల 12న ప్రారంభమైన యాత్ర వైసీపీ ముఖ్యనేతల నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి ..వైసీసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలోకి ప్రవేశించింది. స్థానికంగా వారికి స్వాగతం లభించింది. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు శివారు రెడ్డిపాలెం గ్రామం వద్ద పాదయాత్రకు టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు కారణంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. యాత్రలో పాల్గొంటున్న వారి ఐడీ కార్డులు పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో ఈ యాత్ర రూట్ మ్యాప్ పైన స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని అసెంబ్లీ వేదికగా స్పందించారు.

తన నియోజకవర్గ పరిధిలో ఏ నాయకుడు తిరగని రూట్ లో ఈ యాత్ర కొనసాగేలా ప్లాన్ చేసారని చెప్పుకొచ్చారు. టీడీపీని తాను టార్గెట్ చేస్తుండటంతో..తన నియోజకవర్గంలో వీరిని ఎక్కువ రోజులు తిప్పాలని ప్లాన్ చేసారని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు – జగన్ కూడా వెళ్లని రోడ్ల మీదుగా వారి యాత్ర కొనసాగుతుందన్నారు.

మొత్తంగా 25 రోజుల పాటు తన నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగేలా ప్లాన్ చేసారని వివరించారు. ఎలాగైనా తనను వచ్చే ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా టీడీపీ వ్యవహరిస్తోందని, అందుకు అనుగుణంగానే పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఖరారు చేసిందని సభలో చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ఈ యాత్ర గుడివాడలో ప్రవేశించింది. స్థానికంగా ఉన్న టీడీపీ – జనసేన నేతలు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

కోర్టు సూచనల మేరకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాత్రం గుడివాడలో ఎక్కువ రోజులు కొనసాగి..పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించేలా ప్లాన్ చేసారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అమరావతి టు శ్రీకాకుళం జాతీయ రహదారి మీదుగా కాకుండా, తమ నియోజకవర్గాల మీదుగా నిర్వహించటం వెనుక వారి ఉద్దేశం ఏంటనేది స్పష్టమవుతోందని వాదిస్తున్నారు.

అమరావతి లో ఈ యాత్ర ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు ఎటాంటి ఇబ్బందులు లేకుండానే ముందుకు సాగుతోంది. కానీ, కొడాలి నాని నియోజకవర్గం కావటంతో గుడివాడలో కొనసాగుతున్న యాత్ర ఆసక్తి కరంగా మారుతోంది.