కొడాలి అడ్డాలో అమరావతి పాదయాత్ర-రెచ్చగొట్టొద్దంటూ పోలీసుల హెచ్చరికలు…

అమరావతి రాజధాని కోరుతూ అరసవిల్లి వరకూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుంటోంది. కొన్నిరోజులుగా కృష్ణాజిల్లాలో సాగుతున్న ఈ యాత్ర గుడివాడ చేరుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యాత్రపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కొడాలినాని సొంత నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడలో కొనసాగే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గుడివాడలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే కవాతు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రపై జిల్లా ఎస్పీ జాషువా కూడా స్పందించారు. గుడివాడలో పోలీసు ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. 600 మందితో యాత్ర చేసేందుకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరుతున్నామని రైతులకు విజ్ఞప్తి చేశారు.

అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దని కృష్ణాజిల్లా ఎస్పీ సూచించారు. బాధ్యతారాహిత్యంతో వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది యాత్రలో పాల్గొన్నా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.